కుసుమంచి రాజేశ్వరి. ఈమె వయసు 80 ఏళ్లు. వయసు రీత్యా వినికిడి, చూపు మందగించి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతుంది. విజయనగరం జిల్లా సాలూరు వడ్డి వీధిలో ఉంటుంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు కలరు. భర్త చనిపోయి 15 ఏళ్లయ్యింది. తన వద్ద ఉన్న మొత్తం ఆస్తిని పిల్లల పేరిట రాసేసి కొడుకు దగ్గర ఉంటుంది. కొడుకు సన్యాసిరావు చిన్న పాన్‌షాపు నడుపుకుంటూ పట్టణంలోని పెద్దకోమటి పేటలో తన భార్యాపిల్లలతో ఉంటున్నాడు. కొడుకు ఇల్లు ఇరకుగా ఉండటం, కోడలితో చిన్న చిన్న గొడవల కారణంగా పాన్‌షాపు మేడ మీద ఒక చిన్న డేరా అంచున వుంటుంది. ఎండ, వానల నుంచి పూర్తి రక్షణ లేక తన కొడుకు, కూతుళ్లు పట్టించుకోక అనాథలా బతుకుతుంది. హుద్‌హుద్ తుఫానులో సైతం ఎన్నో ఇబ్బందులు పడింది. ఈమె బాధలు గమనించిన ప్రైవేటు పాఠశాల మాస్టారు విద్యాగిరి ఆమెకు కొంత బాసటగా నిలిచారు. విషయాన్ని పట్టణ ఎస్సై శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె వద్దకు వెళ్లి పరిస్థితిని గమనించిన ఎస్సై వృద్ధురాలి కొడుకు, కూతుళ్లను పిలిపించి మందలించాడు. ఆమెను తన ఇళ్లలోకి తీసుకెళ్లమని తెలిపారు. వారి ఇళ్లు ఇరుకుగా ఉన్నందున ఆమె ఉంటానికి వీలుపడలేదు. దీంతో ఎస్సై, వృద్ధురాలి పిల్లలు, మరికొంత మంది దాతల సహాయంతో మేడ మీద గల డేరా స్థానంలో శాశ్వతమైన బ్లూ కోటెడ్ షీట్లతో ఒక షెడ్డును నిర్మించి ఎండ, వాన తాకిడి లేకుండా ఏర్పాటు చేశారు. ఆమెకు పండ్లు అందించి ఏ సహాయం కావాలన్నా మాస్టారు ద్వారా తన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు.
మానవత్వం వెరసింది... బామ్మకు గూడు వచ్చింది - సాలూరు తాజా వార్తలు
కుటుంబ గొడవలు, ఇతరత్రా కారణాల వల్ల సాలూరుకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలిని ఆమె పిల్లలు వదిలేశారు. ఈ హృదయ విదారక విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై శ్రీనివాస్ తన తోచినంతలో సాయం అందించారు.
వృద్ధురాలికి గూడు కట్టించిన సాలూరు ఎస్సై