విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం తోటపల్లిలోని శ్రీవేంకటేశ్వర, కోదండరామ స్వామి ఆలయాలకు రూ.5.50 కోట్లతో అభివృద్ధి చేసి పూర్వవైభవాన్ని తీసుకొస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. శ్రీవేంకటేశ్వర, కోదండరామస్వామి దేవాలయ జీర్ణోద్ధరణ, అభివృద్ధి పనులకు మంత్రి పుష్ప శ్రీవాణి, వైసీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షులు శత్రచర్ల పరీక్షిత్ రాజు దంపతులు శంకుస్థాపన చేశారు. జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన తోటపల్లి ఆలయం తన సొంత నియోజకవర్గంలో ఉండటం అదృష్టమన్నారు. ఈ ఆలయాన్ని రెండు దశల్లో పూర్తిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
మొదటిదశలో గర్భాలయం, అర్ధమండపం, శ్రీదేవీ భూదేవి ఉపాలయాలు, ముఖమండపం, శ్రీకోదండరామ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ తదితర పనులను రూ.1.20 కోట్లతో చేపట్టనున్నామని వివరించారు. తొలి విడుత నిధులు ఇప్పటికే విడుదలయ్యాయని చెప్పారు. రెండవ దశలో రూ.50 లక్షలతో ఐదు అంతస్థుల రాజగోపురాన్ని, రూ.80 లక్షలతో ప్రాకార మండపాన్ని, రూ.30 లక్షలతో కాలక్షేప మండపాన్ని, రూ.15 లక్షలతో ముఖమండపాన్ని నిర్మిస్తామన్నారు. రూ.10లక్షలతో పాకశాల, రూ.7.5 లక్షలతో వాహన శాల, మరో రూ.7.5 లక్షలతో యాగశాల, రూ.10 లక్షలతో స్వామివారి కళ్యాణ మండపం, రూ.40 లక్షలతో యాత్రీకుల సౌకర్య సముదాయం, దీపాలంకరణ, ఏకాంత సేవ, పుష్పాలంకరణ, ఆర్జిత సేవా మండపాన్ని రూ.40లతో నిర్మించనున్నామని చెప్పారు. రూ.30 లక్షలతో కళ్యాణ కట్ట, మరో రూ.30 లక్షలతో అన్నప్రసాద మండపం, రూ.40 లక్షలతో స్టీల్ బారికేడ్లతో క్యూ కాంప్లెక్స్, రూ.40 లక్షలతో పుష్కరిణి, ఇతర అభివృద్ధి పనులను రూ.50 లక్షలతో చేపట్టనున్నామని పుష్ప శ్రీవాణి వెల్లడించారు. రెండవ దశలో ఆలయ అభివృద్ధి పనులకు మొత్తం రూ.4.30 కోట్లను వెచ్చించనున్నామని తెలిపారు.