విజయనగరం జిల్లా బొబ్బిలిలో రెండు రోజుల క్రితం జరిగిన చోరీ అంత హైడ్రామా అని తేలిపోయింది. చోరీ జరగకుండానే జరిగినట్లు సీన్ క్రియేట్ చేసి పోలీసులను నమ్మించాలని చూశారు. చివరకు ఫిర్యాదుదారులే ముద్దాయిగా తేలడంతో కటకటాలపాలయ్యారు.
- ఏం జరిగిందంటే...
బొబ్బిలి పట్టణం గొల్ల వీధి కూడలిలోని ఓ ఇంట్లో రెండు రోజుల క్రితం చోరీ జరిగినట్లు భోగి సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. 13 తులాల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి వస్తువులు , సుమారు 3 లక్షల నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. రెండు రోజుల్లోనే అసలు విషయం తెలిసింది. చోరీ జరగకుండానే జరిగినట్లు కట్టు కథ అల్లినట్లు తేలింది. భార్య సుజాత, ఆమె కుమారుడు కలిసి భర్తకు తెలియకుండా బీరువాలో ఉన్న నగలు, నగదు వేరే చోట దాచి.. పోయినట్లు ఫిర్యాదు చేశారని దర్యాప్తులో తేలింది.