గులాబ్ ప్రభావంతో విజయనగరం జిల్లాలో మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. చెరువులు, నదులు, వాగులు కట్టలు తెంచుకుని ప్రవహించాయి. రోడ్లను ధ్వంసం చేశాయి. జిల్లాలో పంచాయతీ రాజ్, రహదారులు భవనాల శాఖకు సంబంధించి 250కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. వీటి తాత్కాలిక మరమ్మతుల కోసం.. దాదాపు రూ.35కోట్లపైనే అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. శాశ్వత రహదారుల నిర్మాణం కోసం 200కోట్లపైనే ఖర్చవుతుందని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గులాబ్ ప్రభావం వల్ల..విజయనగరం, డెంకాడ, గ్యంటాడ, పూసపాటిరేగ, నెల్లిమర్ల, గుర్ల, గరివిడి మండలాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. గోతుల వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోందని జనం వాపోతున్నారు.సాలూరు, బొబ్బిలి ప్రాంతాల్లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. గోముఖిపై కాజ్వే దెబ్బతినటంతో ఈ మార్గంలో ప్రయాణికుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి.
వాహనదారుల ఇబ్బందులు
జిల్లావ్యాప్తంగా 92కిలోమీటర్ల మేర జాతీయ రహదారులుండగా.. సాలూరు, కొమరాడ మార్గాల్లో పలుచోట్ల దెబ్బతిన్నాయి. ఈ మార్గంలో ఒడిశా, ఛత్తీస్ఘఢ్, మధ్యప్రదేశ్‌లోని కర్మాగారాలకు సరుకు ఎగుమతులు, దిగుమతులు సాగుతుంటాయి. గోతుల మయంగా మారిన రహదారిని గత నాలుగు నెలల క్రితం బాగు చేశారు. తాజాగా గులాబ్ కారణంగా ఈ రహదారులు గోతులు మయంగా మారాయి. ప్రయాణ సమయం పెరిగిపోతోందని వాహనదారులు చెబుతున్నారు.