విజయనగరంలో అధ్వానంగా రోడ్లు DAMAGED ROADS:విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో 102 కిలోమీటర్ల మేర రహదారులు ఉన్నాయి. ఇందులో సుమారు 300 వరకూ గుంతలు పడినట్టు అధికారులు గుర్తించారు. మరమ్మతుల కోసం 39లక్షలు ఖర్చవుతాయని అంచనా వేశారు. నిధుల కొరత కారణంగా వీటిలో కొన్నింటినే బాగు చేస్తున్నారు. నగరపాలక సంస్థ ఈ వార్షిక బడ్జెట్లో రహదారుల మరమ్మతులకు, కొత్త రోడ్ల నిర్మాణానికి 15 కోట్ల 30 లక్షలు కేటాయించినా.. ఇప్పటి వరకు మరమ్మతులు చేసిన గుత్తేదారులకు రెండున్నర కోట్లు బకాయిలుండటం నిధుల లేమి నిదర్శనం.
విజయనగరంలో రోడ్ల పరిస్థితి, ప్రజల ఇబ్బందులపై ఈటీవీ-ఈనాడు ప్రతినిధులు పరిశీలన జరిపారు. పైడితల్లి ఉత్సవాల సమయంలో మయూరి కూడలి నుంచి పెద్దచెరువు కూడలి వరకు ప్యాచ్ వర్క్ చేశారు. పనులు నాసిరకంగా చేయటంతో నెల రోజులకే డొల్లతనం బయటపడింది. ఇప్పుడు ఆ మార్గంలో ప్రయాణించాలంటేనే జనం భయపడుతున్నారు. ప్రజాధనం దుర్వినియోగం తప్ప.. ఈ పనులతో ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు.
అంబటి సత్రం నుంచి కొత్తపేట నీళ్ల ట్యాంకు వరకు విస్తరించిన రహదారిపై ఏడేళ్లుగా వాహనదారులు నరకం చూస్తున్నారు. ఆధునికీకరణ పేరుతో అప్పట్లో అధికారులు హడావుడిగా రహదారిని తొలగించారు. కొందరు భవన యజమానులు కోర్టుకు వెళ్లడంతో.. ఆ దారి కనీస మరమ్మతులకు కూడా నోచుకోక అస్తవ్యస్తంగా మారింది. వర్షాకాలంలో మోకాల్లోతు గుంతలతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.
ఉడా కాలనీ రోడ్డులో.. రైతుబజార్ నుంచి అయ్యన్నపేట కూడలి వరకు ఒకటిన్నర కిలోమీటర్ పరిశీలిస్తే 40గుంతలు కనిపించాయి. ఇందులో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పొడవున్న గుంతలు 29 ఉండగా.. 15 నుంచి 20సెంటీమీటర్ల పొడవున్నవి ఆరు. మరో ఐదు గుంతలు 10 నుంచి 15 సెంటీమీటర్ల పొడవున్నాయి. ఇవికాకుండా 10 సెంటీ మీటర్లలోపు గుంతలు మరో 40 కనిపించాయి. ఆర్టీసీ కాలనీ నుంచి పాల్ నగర్ కూడలి వరకు సుమారు 300 మీటర్ల పొడవు రహదారి పూర్తిగా దెబ్బతింది. పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఇక్కడ రెండున్నరేళ్ల క్రితం రహదారి నిర్మాణానికి కంకర వేసి వదిలేశారు. ఆరు గ్రామాల ప్రజల రాకపోకలకు ప్రధాన ఆధారమైన ఈ రహదారిలో తరచూ ప్రమాదాలు సాధారణంగా మారాయి.
కొత్త రహదారుల నిర్మాణం సంగతేమో గానీ.. కనీసం పాత వాటికి మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. దీంతో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కోర్టు కేసులతో అర్థాంతరంగా నిలిచిన రహదారుల్లో కనీస మరమ్మతులైనా చేపట్టాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి: