Highway Accidents: 2020 సంవత్సరంలో 118 రోడ్డు ప్రమాదాలు జరగగా 44మంది మృతి చెందారు. 2021 సంవత్సరంలో 132ప్రమాదాలు జరిగితే 65మంది మృత్యువాత పడ్డారు. 2022 సంవత్సరంలో ఇప్పటి వరకు 42ప్రమాదాలు సంభవించగా 21మంది దుర్మరణం చెందారు. మృత్యుమార్గంగా విజయనగరం జిల్లా వాసుల్ని భయపెడుతున్న కోల్‌కతా-చెన్నై 16వ నెంబర్ జాతీయ రహదారిపై గత మూడేళ్లలో చోటుచేసుకున్న ప్రమాదాల తాలుకా వివరాలివి. రహదారి నమునా లోపాలే ఈ ప్రమాదాలకు కారణమని స్థానికులు వాపోతున్నారు.
"రహదారి విస్తరణ కార్యక్రమం బాగానే జరిగింది. నిర్వహణ సరిగా లేదు. సూచిలు పెట్టలేదు. రోడ్డు ఎత్తు పల్లాలు ఉన్నాయి. వాటిన సరి చేసిన ఇబ్బందిగా ఉంది. వర్షం పడినప్పుడు రహదారిపై నీరు నిల్వ ఉంటోంది. నీరు బయటకు వెళ్లే మార్గం లేదు." - జిల్లావాసి
భోగాపురం పోలీసు సర్కిల్ పరిధిలో 28కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ పనులు జరిగాయి. అదే సమయంలో ప్రమాదాలు పెరిగాయి. ఈ ఏడాది జులైలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్ధులు భోగాపురం సర్వీసు రోడ్డులో లారీ ఢీకొట్టగా.. ఒక్కరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగస్టులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ జంట ఇదే ప్రాంతంలో లారీని ఢీకొన్నారు. ఈ ఘటనలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇలా ఈ రోడ్డులో ప్రమాదాలు నిత్యం జరగడంతో స్థానికులు బెంబెలెత్తిపోతున్నారు.
"సర్వీసు రోడ్డు రహదారికి కలిసే దగ్గర స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలి. అవి లేకపోవటం వల్ల వేగంగా వచ్చి ప్రమాదాలకు గురవతున్నారు. వాహనాల వేగం నియంత్రణలో లేకోపోవటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రదేశాలలో స్పీడ్ బ్రేకర్లు ఉన్న.. వాటిని సూచించేలా సూచీలు ఏర్పాటు చేయాలి." - జిల్లావాసి
విశాఖ జిల్లా ఆనందపురం నుంచి శ్రీకాకుళం జిల్లా, రణస్థలం వరకు 16 వ నెంబర్ జాతీయ రహదారిని ఆరు వరుసల రోడ్డుగా మార్చారు. దీంతో ప్రమాదాలు తగ్గుతాయని స్థానికులు భావించారు. అయితే పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. రాజాపులోవ, పోలిపల్లి, అమనాం, భోగాపురం, సుందరపేట, పేరాపురం, కందివలస హైవే వంతెనల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. సర్వీసు రోడ్ల నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లే ప్రాంతాల్లో ముఖ్యంగా భోగాపురం-ముక్కాం కూడలి, సుందరపేట వంతెనల వద్ద వాహనాలను అడ్డంగా నిలిపేస్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని జిల్లా వాసులు అంటున్నారు. ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టామన్న పోలీసులు.. ప్రధాన కూడళ్ల వద్ద భారీ వాహనాల నిలుపకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
"రోడ్డు ప్రమాదాలు అధికంగా సంభవించే స్థలాలు, రోడ్డు దాటాడానికి వీలు లేని ప్రాంతాలను గుర్తించి.. వాటికి సంబంధించిన సూచీలను రోడ్డు పక్కన ఏర్పాటు చేస్తున్నాము. వాతావరణం అనుకూలించక కూడా ప్రమాదాలు జరగుతున్నాయి. పొగ మంచు, వాన వల్ల రోడ్డు సరిగా కనిపించకపోవటం వల్ల ప్రమాదాలు. మూల మలుపుల వద్ద భారీ వాహనాలు నిలిపి ఉంచకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము." -కేవీవీ. విజయనాథ్, భోగాపురం సీఐ
రహదారులు కాదు.. మృత్యుమార్గాలంటున్న ప్రజలు ఇవీ చదవండి: