రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు మెరుపు సమ్మెకు దిగటంతో విజయనగరం జిల్లాలో ఎనిమిదో విడత రేషన్ పంపిణీ నిలిచిపోయింది. జిల్లాలోని 1400 డిపోల్లో ఎక్కడా తొలిరోజు బియ్యం పంపిణీ జరగలేదు. ప్రభుత్వ ముందస్తు ప్రకటన నేపథ్యంలో పేద ప్రజలు రేషన్ దుకాణాలకు వచ్చి వెనుదిరిగారు. ఎలాంటి సమాచారం లేకుండా రేషన్ పంపిణీ నిలిపివేయటంపై ఆసనహం వ్యక్తం చేశారు.
డీలర్ల మెరుపు సమ్మె.. నిలిచిన రేషన్ పంపిణీ - రేషన్ డీలర్ల సమ్మె వార్తలు
రేషన్ డీలర్లు మెరుపు సమ్మెకు దిగటంతో విజయనగరం జిల్లావ్యాప్తంగా రేషన్ పంపిణీ నిలిచిపోయింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు రేషన్ పంచేది లేదని డీలర్ల సంఘం చెప్పింది. మరోవైపు రేషన్ దుకాణాలకు వచ్చిన కార్డుదారులు నిరాశగా వెనుదిరిగారు.
విపత్కర పరిస్థితుల్లోనూ పేదలకు రేషన్ పంపిణీ చేస్తున్నాం. అయినప్పటికీ మాకు రావాల్సిన కమీషన్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. కరోనా సమయంలో సేవలందిస్తున్న మిగతా ఉద్యోగులకు ఇచ్చిన ప్రాధాన్యత మాకు ఇవ్వలేదు. కనీసం పీపీఈ కిట్లు ఇవ్వలేదు. బీమా సౌకర్యం కూడా కల్పించలేదు. రేషన్ సరుకుల పంపిణీ సమయంలో వినియోగదారులు వేలి ముద్రల నిబంధన సడలించాలి. మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోవటంతోనే మెరుపు సమ్మెకు దిగాల్సి వచ్చింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలి- మోహన్ రావు, రేషన్ డీలర్ల రాష్ట్ర ఉపాధ్యక్షుడు