విజయనగరం జిల్లా పరిధిలో నిర్మిస్తున్న జాతీయ రహదారులు, భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియపై జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర రోడ్లు భవనాలు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టి.కృష్ణబాబు సమీక్షించారు. భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పరిధిలో చేపట్టనున్న జాతీయ రహదారులు, కోస్టల్ కారిడార్, సాలూరు, విజయనగరం బైపాస్ రోడ్లకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన భూసేకరణ, కొన్ని ప్రాంతాల్లో భూ సేకరణలో నెలకొన్న సమస్యలను కలెక్టర్ హరి జవహర్ లాల్.. కృష్ణబాబుకు వివరించారు. అనంతరం కృష్ణబాబు., ప్రాజెక్టుల వారీగా అధికారులతో సమీక్షించారు.
విజయనగరం జిల్లా పరిధిలో సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల నిధులతో జాతీయ రహదారులు మంజూరయ్యాయి. ఇందులో విశాఖ - రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి, బొడ్డవరం జాతీయ రహదారి ప్రధానమైనవి. వీటితో పాటు.. విశాఖ -భోగాపురం విమానాశ్రయం వరకు 50కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న కోస్టల్ కారిడార్ అతి ముఖ్యమైంది. మరోవైపు 800కోట్లలతో సాలూరు, విజయనగరంలో బై-పాస్ రహదారులను నిర్మించ తలపెట్టాం. ఈ నిర్మాణాలకు సంబంధించి నిధులు మంజూరు కావడం వల్ల గుత్తేదారులూ ఖరారు అయ్యారు. -టి.కృష్ణబాబు, రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి