విజయనగరం పురపాలక సంస్థ 1888లో ఆవిర్భవించగా...1988 నాటికి సెలక్షన్ గ్రేడ్ పురపాలక సంస్థగా హోదా పొందింది. రోజురోజుకు విస్తరిస్తున్న నగరం పురపాలక స్థాయి నుంచి నగరపాలక సంస్థగా మార్పు చెందింది. ఆ సమయంలో నగరానికి సమీపంలో ఉన్న గాజులరేగ, వేణుగోపాల్ నగర్, అయ్యన్నపేట, జమ్ము, కె.ఎల్.పురం, ధర్మపురి, కణపాక గ్రామాలను.. విజయనగరం నగరపాలక సంస్థలో విలీనం చేశారు.
అప్పట్లో ఆయా గ్రామాల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైనా.. సమస్యలు పరిష్కారం అవుతాయన్న ప్రజాప్రతినిధుల హామీతో విలీనానికి ఒప్పుకున్నారు. ఎనిమిదేళ్లు గడిచినా సమస్యలు తీరకపోగా.. తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక మౌలిక వసతుల కొరత ప్రజలను వెంటాడుతోంది. తాగునీరు, రహదారులు, మురుగు నీటి సౌకర్యాల లేమితో ప్రజలు సతమతం అవుతున్నారు.
విలీన కాలనీలు అన్నింటిలోనూ తాగునీటి సమస్య తాండవిస్తోంది. 90శాతం మంది చేతిపంపులపైనా ఆధారపడాల్సిన పరిస్థితి. కార్పొరేషన్ ట్యాంకర్లు ఏర్పాటు చేసినా.. ఇచ్చే రెండు బిందెల నీళ్లు తమ అవసరాలకు ఏ మాత్రం సరిపోవటం లేదని స్థానికులు అంటున్నారు. పైగా రోజు మార్చి రోజు వస్తున్నాయని చెబుతున్నారు. గతంలో కుళాయిలు ఏర్పాటు చేస్తామంటూ డబ్బులు వసూలు చేసినా.. ఇప్పటికీ ఆ ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.