ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మధ్యాహ్న భోజన పథకానికి నిధుల కొరత.. నాణ్యతలో రాజీ - mid day meal scheme in government schools

Problems in Mid Day Meal Scheme: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచడంతో పాటు.. పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన మధ్యాహ్న భోజన పథకానికీ.. నిధుల కొరత సెగ తగులుతోంది. ప్రభుత్వం.. నిర్వాహకులకు ఇచ్చే డబ్బులు చాలక.. నాణ్యతలో రాజీ పడాల్సి వస్తోంది. ఫలితంగా విద్యార్థులకు అందించే భోజనం నాసిరకంగా మారుతోంది. విజయనగరం, మన్యం జిల్లాల్లోని పాఠశాలల్లో ఇటీవల ఆహారం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురికావడం.. పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పాఠశాలల్లో.. మధ్యాహ్న భోజన నిర్వహణలో నెలకొన్న సమస్యలపై కథనం.

మధ్యాహ్న భోజన పథకంలో సమస్యలు
Problems in Mid Day Meal Scheme

By

Published : Feb 12, 2023, 8:46 AM IST

మధ్యాహ్న భోజన పథకంలో నెలకొన్న సమస్యలు

Problems in Mid Day Meal Scheme: విజయనగరం జిల్లాలో 17 వందల 52 పాఠశాలల్లో సుమారు లక్షా 41 వేల మంది, అలాగే మన్యం జిల్లాలోని 15 వందల 82 బడుల్లో 82 వేల 595 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. చాలా పాఠశాలల్లో వంటశాలలు లేవు. 8 ఏళ్ల కిందట.. రెండు విడతలుగా వంటగదులు మంజూరు చేశారు. తొలివిడతలో 108, రెండో విడతలో 436 గదుల్ని నిర్మించారు. నిధులు లేని కారణంగా.. 45 చోట్ల పనులు ప్రారంభం కాలేదు. అప్పటికే నిర్మాణంలో ఉన్నవాటికి డబ్బు రాకపోవడంతో.. 37 చోట్ల గుత్తేదారులు మధ్యలోనే చేతులెత్తేశారు. ప్రస్తుతం ఉన్నవాటిలో.. 30 శాతం వరకు వంటగదులు మరమ్మతులకు గురైనట్లు అంచనా. ఫలితంగా అనేకచోట్ల.. చెట్ల కింద, ఆరుబయటే మధ్యాహ్న భోజనం వండుతున్నారు.

కొన్ని చోట్ల అపరిశుభ్రంగా ఉన్న పరిసరాల్లోనే వంట చేస్తున్నారు. అన్నం బయటే ఆరబెడుతున్నారు. ఇక అన్నం.. సరిగా ఉడకకపోవడంతో.. విద్యార్థులు తినలేక పడేస్తున్నారు. ఒకవేళ తిన్నా.. కడుపునొప్పితో అస్వస్థతకు గురవుతున్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస సాంఘిక సంక్షేమ బీసీ బాలికల వసతిగృహం, మన్యం జిల్లా మక్కువ మండలం కోన ప్రాథమికోన్నత పాఠశాలలో.. ఆహారం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురికావడం.. ఇందుకు నిదర్శనం. మెనూ ప్రకారం కాకుండా కొన్ని చోట్ల మార్చి ఆహారం పెడుతుండటంతో.. అవి నచ్చక చాలా మంది పిల్లలు ఇళ్లకు వెళ్లిపోతున్నారు.

మధ్యాహ్న భోజనంలో సమస్యలకు ప్రభుత్వమే కారణమని.. నిర్వాహక సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. నాణ్యమైన బియ్యం ఇవ్వకపోవడం, ఏజెన్సీల నియామకాల్లో మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగానే.. మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తోందని చెబుతున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం చెల్లిస్తున్న డబ్బు.. ఏ మాత్రం చాలడం లేదంటున్నారు. మెనూ నిర్ణయంలో.. క్షేత్రస్థాయి సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని.. తప్పుపడుతున్నారు.

"ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం నిర్వాహకులకు వేరేగా బియ్యం ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం అలా సప్లై చేయడం లేదు. ఆ కారణంగా రేషన్ బియ్యంతో భోజనం చేయడానికి పిల్లలు ఇష్టపడటం లేదు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఉండాలి". - మురళీధర్‌రావు, విజయనగరం జిల్లా అధ్యక్షుడు, మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘం

"ఒక రోజులో.. ఒక పిల్లాడు తినే భోజనానికి 5 రూపాయల 88 పైసలు.. హైస్కూల్ విద్యార్థులకు 8 రూపాయల 89 పైసలు ఇస్తున్నారు. ఇలా ఇవ్వడం వలన ఎంత వరకూ విద్యార్థులకు భోజనం అందుతుంది. అధికారులు వచ్చి భోజనం నాణ్యత చూస్తున్నారు కానీ ఎంత ఖర్చు అవుతుంది అని అడగడం లేదు". - స్రవంతి, రాష్ట్ర అధ్యక్షురాలు, మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details