1857లో స్థాపించిన విజయనగరంలోని మహారాజా స్వయం ప్రతిపత్తి కళాశాల ప్రైవేటీకరణ ప్రక్రియకు ఆమోదముద్రపడినట్లు తెలుస్తోంది. 1879 నుంచి నిర్వహిస్తున్న ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో..ఈ ఏడాది నుంచీ ఇంటర్ కోర్సు నిలిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. 160 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ విద్యాసంస్థ... కొన్నాళ్లు మాన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలో నడిచింది. తర్వాత స్వయం ప్రతిపత్తి హోదా పొందింది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న కళాశాలలో..ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ కోర్సు ఎత్తేసే ప్రతిపాదనను మాన్సాస్ ట్రస్టు తీసుకొచ్చింది. ఈ విషయంపై ఇంటర్‌బోర్డు అధికారులను సంప్రదించినట్లు అధికారవర్గాలు ధ్రువీకరించాయి.
ప్రస్తుతం ఇంటర్‌లో 500మంది విద్యార్థులు ఉండగా..14మంది అధ్యాపకులు, ఆరుగురు బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. డిగ్రీలో ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ గా రెండు విభాగాలు కొనసాగుతున్నాయి. ఎయిడెడ్ విభాగంలో బీఎస్సీ, బీఏ, బీకాం కోర్సులలో తొమ్మిది సెక్షన్లు ఉన్నాయి. ఇక్కడున్న 26మంది అధ్యాపకులు, 20మంది బోధనేతర సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్ చేసేందుకు మాన్సాస్ ట్రస్టు పాలకవర్గం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయ అధ్యాపకులూ ఈ విషయాన్నీ ధ్రువీకరిస్తున్నారు. ఇదే యాజమాన్యం నిర్వహిస్తున్న కోటలో ఉన్న మరో డిగ్రీ కళాశాల ఎయిడెడ్ విభాగంలో 17 మంది అధ్యాపక, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. వీరినీ ప్రభుత్వానికి అప్పగించే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. వీరిందరిని జిల్లాలోని ప్రభుత్వ కళాశాల్లో సర్దుబాటు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా రెండు కళాశాలల్లోని అధ్యాపక, సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగిస్తే..అన్ ఎయిడెడ్ విభాగం మాత్రమే మిగలనుంది. కళాశాలలు ప్రైవేటు పరిధిలోకి రావడానికి మార్గం సుగమం కానుంది.