విజయనగరం జిల్లా మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. సరైన రహదారులు, వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా.. కొమరాడ మండలంలోని సొలపదం పంచాయతీ పరిధిలోని గిరిజన గూడెంలో ఓ గర్భిణికి పురిటి నొప్పులు మెుదలయ్యాయి. ఆమె భర్త 108కు ఫోన్ చేయటంతో సరైన రహదారి వసతులు లేక అంబులెన్స్ వత్తాడ వరకే వచ్చింది. వీరి గ్రామం నాగావళి నదికి అవతలి వైపున ఉండటంతో బంధువుల సాయంతో గర్భణిని నది దాటించారు.
అనంతరం వత్తాడలో 108 వాహనం ఎక్కించి పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి సమయంలో గర్భిణికి ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అని బంధువులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి తమ గ్రామానికి వంతెన, రహదారి సౌకర్యం కల్పించాలని వేడుకొంటున్నారు. సకాలంలో పూర్ణపాడు వంతెనను పూర్తి చేసి గిరిజనుల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.