ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోర్టిఫైడ్ బియ్యంపై అపోహలు వద్దు: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ కేంద్రంలో పోషకాలు కలిగిన బలవర్ధకపు బియ్యం(పోర్టిఫైడ్ రైస్) పంపిణీ చేశారు.

rice distribution
బియ్యం పంపిణీ

By

Published : Jun 1, 2021, 4:35 PM IST

ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం సూక్ష్మ పోషకాలు కలిగిన బలవర్ధకపు బియ్యం(పోర్టిఫైడ్ రైస్) సరఫరా చేస్తోందని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు. విజయనగరం జిల్లా కురుపాంలో.. ఆమె బియ్యం పంపిణీ ప్రారంభించారు. పోర్టిఫైడ్ బియ్యం సాధారణ బియ్యం కాదని, ప్లాస్టిక్​ బియ్యమని చాలా మందిలో అపోహలున్నాయన్నారు. ఇవి... విటమిన్లు, పోషకాలు కలిపిన సాధారణ బియ్యమేనని ఆమె తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏడు లక్షల కుటుంబాలకు ప్రభుత్వం ఈ బియ్యాన్ని అందిస్తోందని తెలిపారు.

పోర్టిఫైడ్ బియ్యంపై ప్రజల్లో ఉన్న అపోహల కారణంగా వాటిని ఉపయోగించకుండా మార్కెట్లో అమ్మేస్తున్నారని పుష్ప శ్రీవాణి అన్నారు. ఈ బియ్యాన్ని మిల్లింగ్ చేసే సమయంలో వీటిలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 కలుపుతారని వివరించారు. ఈ రైస్​ తిన్నవారికి పోషకాలు బాగా అందుతాయని, శరీరంలో నాడీ వ్యవస్థ మెరుగ్గా పని చేస్తుందని, గర్భిణులలో పిండం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

ఈ నెల నుంచి కురుపాం నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లో పోర్టిఫైడ్ బియ్యం అందజేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలందరి ఆరోగ్యాలను పరిరక్షించడానికి, పేదలకు అత్యాధునికమైన వైద్య సదుపాయాలను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇందుకు సీఎం జగన్​ 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. రూ.8 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం సబ్ కలెక్టర్ విధేకర్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:మేనిఫెస్టోలోని హమీల్లో 95శాతం పూర్తి: సామినేని ఉదయభాను

ABOUT THE AUTHOR

...view details