పేదల నష్ట పరిహారం కొట్టేసేందుకు.. అక్రమార్కుడి గ'లీజు' పన్నాగం! Central Tribal University: నిరు పేదల భూమి పరిహారంపై ఓ లీజుదారు కన్నేశాడు. కొన్నేళ్ల క్రితం డీ - పట్టాభూములు లీజుకు తీసుకున్న వ్యక్తి ఒప్పంద గడువు ముగిసినా, పెత్తనం చెలాయించాలని చూస్తున్నాడు. ఇప్పుడా భూములు కేంద్రీయ గిరిజన వర్సిటీ కోసం సేకరించడంతో పరిహారం రైతులకు కాకుండా తనకే దక్కాలంటూ కుయుక్తులు పన్నాడు. 99 ఏళ్ల పాటు భూములు తనకు లీజుకిచ్చినట్లు ఒప్పందం ఉందని, పరిహారంలో సగం వాటా ఇస్తే తాను అడ్డుపడబోనని బెదిరిస్తున్నాడు. ఈ వ్యవహారంలో భూ యజమానుల బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయడం అనుమానాలకు తావిస్తోంది.
పరహారం.. ఓ వ్యక్తి కన్ను: విజయనగరం జిల్లా చినమేడపల్లి, మర్రివలస గ్రామాల పరిధిలో కేంద్రీయ గిరిజన వర్సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం 561.88 ఎకరాల భూమిని సేకరిచింది. అందులో 208.72 ఎకరాల మేర డీ - పట్టా భూములున్నాయి. వాటికి ఎకరాకు 9 లక్షల రూపాయలు పరిహారంగా నిర్ణయించిన అధికారులు భూ యజమానుల పట్టాదారు పాసు పుస్తకాలూ తీసుకున్నారు. డీ పట్టాలు స్వాధీనం చేసుకుని నెలలో పరిహారం బ్యాంకు ఖాతాల్లో జమౌతుందని చెప్పారు. నాలుగైదు నెలలైనా ఖాతాల్లో డబ్బు పడలేదు. విషయం ఏంటని ఆరా తీస్తే.. తమ పరిహారంపై ఓ వ్యక్తి కన్నేసినట్లు తెలుసుకున్నారు.
ఖాళీ స్టాంపు కాగితం.. నకిలీ పత్రాలు.. ప్రయోజనం లేదు:గిరిజన వర్సిటీకి భూములిచ్చిన వారిలో కొందరు రైతులు సుమారు 40 ఎకరాలను 8 ఏళ్ల క్రితం చినమేడపల్లి పరిధిలోని ఓ వ్యక్తికి మూడేళ్ల పాటు లీజుకు ఇచ్చారు. అప్పట్లో ఆ వ్యక్తి ఖాళీ స్టాంపు కాగితంపై సంతకాలు తీసుకున్నారని రైతులు చెబుతున్నారు. లీజు కాలం ముగిసినా ఆ కాగితాలు వెనక్కివ్వలేదంటూ ఐదేళ్ల క్రితమే పోలీసుల్ని ఆశ్రయించగా వాటిని తిరిగి ఇప్పించారని రైతులు తెలిపారు. మళ్లీ అదే పాత లీజుదారు తమ పరిహారం కొట్టేసే కుయుక్తులు పన్నాడని ఆరోపిస్తున్నారు. సదరు భూముల్ని99 ఏళ్లు లీజుకు ఇచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే పరిహారంలో సగం తనకు ఇవ్వాలని బెదిరిస్తున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను చివరకు ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర, ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
వివరణ.. ప్రభుత్వ జోక్యం:ఇదే సమయంలో బాధితుల బ్యాంకు ఖాతాలను అధికారులు స్తంభింపజేయడం చర్చనీయాంశమైంది. బ్యాంకర్లకు భూమి లీజుల వివాదంతో ఏం సంబంధం అని ప్రశ్నించినా సరైన వివరణ ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు అన్యాయం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఇవీ చదవండి