Police Stops the Teachers : సీపీఎస్ రద్దు కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు చేపట్టిన ఉద్యమంలో భాగంగా విశాఖలో "ఉపాధ్యాయుల ఉప్పెన" పేరుతో జీవీఎంసీ గాంధీ పార్కులో ఆందోళన నిర్వహించారు. వర్షంలో తడుస్తూనే ఆందోళన కొనసాగించారు. "సీపీఎస్ అంతం - అదే మన పంతం.. పెట్టుబడుల పెన్షన్ - బతుకంతా టెన్షన్.. అప్పడేమో ముద్దులు - ఇప్పుడేమో గుద్దులు" అంటూ ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. సీపీఎస్ రద్దు చేయడమో - వైసీపీ ప్రభుత్వం దిగిపోవడమో జరగాలని నినదించారు.
ఉపాధ్యాయులు చేస్తోన్న ఆందోళన కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఉపాధ్యాయులకు నోటీసులిచ్చి వేధించడం దారుణమని మండిపడ్డారు. ఏకవ్యాఖ్య తీర్మానంతో సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేసారు. అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు ఉపాధ్యాయులను మోసం చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి సీపీఎస్ రద్దు చేయాలని.. లేకుంటే ముస్సోలిని, హిట్లర్ మాదిరిగా చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.
40 మంది ఉపాధ్యాయులను అడ్డుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు: C.P.S. రద్దు కోసం.. విశాఖ బయలుదేరిన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు.విజయనగరం జిల్లా రాజాం నుంచి విశాఖపట్నం వెళుతున్న ఉపాధ్యాయులను భోగాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. CPS రద్దుకై " ఉపాధ్యాయుల ఉప్పెన " పేరుతో నిరసన తెలియజేయడానికి విశాఖపట్నం వెళ్తున్న రాజాం నియోజకవర్గంకి చెందిన సుమారు 40 మంది ఉపాధ్యాయులను భోగాపురం వద్ద పోలీసులు అడ్డుకొని అక్కడ స్టేషన్‌కి తరలించారు. దీంతో స్టేషన్లోనే ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు. శాంతియుతంగా చేపడుతున్న నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం తగదని ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేెశారు.
అరెస్టు చేసిన వారిని తక్షణమే విడిపించాలి: విశాఖపట్నంలో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులను అక్రమ అరెస్టులు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించడం అన్యాయమని ఏపీటీఎఫ్, యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యాయ నాయకులు మీసాల నాయుడు, వెంకట నాయుడు, లంక రామకృష్ణ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని ఉన్నతాధికారి నుంచి అనుమతులు తీసుకున్నప్పటికీ తమపై పైశాచిక దాడి తగదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి వెళ్తున్నామని.. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడిపించాలంటూ వారంతా కోరారు. ఈ క్రమంలో స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: