Teacher murder: విజయనగరం జిల్లా రాజాం మండలం కొత్త పేట వద్ద ఉపాధ్యాయుడు కృష్ణ హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల వివరాలను జిల్లా ఎస్పీ దీపిక మీడియా సమావేశంలో వెల్లడించారు. తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కృష్ణ.. రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారంరావటంతో రాజాం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మొదట్లో రోడ్డు ప్రమాదమని భావించినప్పటికీ.. హతుడి బంధువులు, గ్రామస్థుల ఫిర్యాదుతో లోతుగా విచారణ చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. దర్యాప్తు ఆధారంగా ఘటన జరిగిన 24గంటల్లోనే ప్రధాన నిందితుడు వెంకటనాయుడుతో పాటు మోహన్, గణపతి, రామస్వామిని అరెస్టు చేశామన్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
ఆధిపత్య పోరు నేపథ్యంలోనే.. గ్రామంలో వెంకటనాయుడు మధ్య నెలకొన్న ఆధిపత్య పోరే కృష్ణ హత్యకు దారి తీసింది. వెంకట నాయుడు కుటుంబీకులు ఉద్దవోలులో ప్రభుత్వ పథకాలకు చెందిన పలు నిర్మాణాలు చేపట్టారు. వాటికి సంబంధించిన బిల్లుల మంజూరులోని ఉపాధ్యాయుడు కృష్ణ అడ్డుకుంటున్నారని, తన రాజకీయ ఎదుగులకు ఆటంకంగా మారారని వెంకటనాయుడు కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో కృష్ణను అడ్డు తొలగించుకోవాలన్న నిర్ణయంతో హత్యకు పథకం వేసినట్లు ఎస్పీ తెలిపారు. పథకంలో భాగంగా.. రాజాం మండలం కర్లంరాజుపేట పాఠశాలలో పని చేస్తున్న కృష్ణ విధులకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా హతమార్చారు. తొలుత మోహన్, రెడ్డిరాము బొలోరో వాహనంతో కృష్ణను ఢీకొట్టారు. అనంతరం ఇనుప రాడుతో కొట్టి చంపినట్లు విచారణలో తేలినట్లు ఎస్పీ చెప్పారు. వ్యక్తిగత కక్షలు, ఆధిపత్యపోరే తప్ప ఎలాంటి రాజకీయ కారణాలు లేవని ఎస్పీ చెప్పారు. కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశామని, మరొకరిని అరెస్టు చేయాల్సి ఉందని వివరించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించిన ఎస్పీ.. హతుడి బంధువులు, ఆయన మద్దతుదారులు గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు.