హత్య కేసును ఛేదించిన పోలీసులు - హత్య కేసును ఛేదించిన పోలీసులు
బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్న యువకుడి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివాహితుడైన అతను రెండేళ్లుగా ఆ బాలికతో చాటుమాటుగా సంబంధం కొనసాగిస్తున్నాడు. విసిగిపోయిన బాలిక తల్లిదండ్రులు.. మద్యం మత్తులో ఉన్న యువకుడిని గొంతుకు తాడు బిగించి హతమార్చారు.
విజయనగరంలోని గంజిపేట సమీపంలో కంటోన్మెంట్ రెల్లివీధికి చెందిన టి.వినోద్‌కుమార్ (25) హత్యకు గురయ్యాడు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. వివరాలను డీఎస్పీ పి.అనిల్‌కుమార్ వెల్లడించారు. కంటోన్మెంట్‌కు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు టి.వినోద్‌కుమార్‌కు వివాహమైంది. రెండేళ్ల కిందట గంజిపేటలోని బంధువైన 16 ఏళ్ల బాలికతో పరిచయం ఏర్పడింది. ఈ విషయంలో గతంలో పలుమార్లు వినోద్ భార్యకు, బంధువుల మధ్య ఘర్షణ జరిగింది. అయినా వినోద్‌కుమార్ పద్ధతి మార్చుకోలేదు. ఈ నెల 17న మద్యం మత్తులో రాత్రి బాలిక ఇంటికి వెళ్లాడు. ఇది అమ్మాయి తల్లిదండ్రులు గమనించడంతో గొడవ జరిగింది. ఇద్దరు కలిసి వినోద్ మెడకు తాడు బిగించి గదిలోకి లాక్కొని వెళ్లి ఉరివేసి హత్య చేశారు. అతను చనిపోయాడని నిర్ధారించుకున్నాక మృతదేహాన్ని ఓ కిరాణ దుకాణం సమీపంలో పడేశారు. మరుసటి రోజు బాలిక తండ్రి ఏమీ తెలియనట్లు వినోద్‌కుమార్ ఇంటికి వెళ్లి మీ వాడు బాగా తాగేసి రోడ్డుపై పడిఉన్నాడని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు అక్కడికి వెళ్లి కేంద్రాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య రమ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం ఉదయం బాలిక తల్లిదండ్రులు నేరం అంగీకరించి లొంగిపోయారు. పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.