విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం మర్రివలసలో "వై.ఎస్.ఆర్.జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష" కార్యక్రమానికి రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి భూమిపూజ చేసి లాంఛనంగా ప్రారంభించారు. డ్రోన్ టెక్నాలజీతో గ్రామానికి సంబంధించి తీసిన ఛాయాచిత్రాలను మంత్రులు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చినప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్యలతో కలసి తిలకించారు. భూముల సర్వేలో భాగంగా వినియోగించే కోర్స్ రోవర్స్, డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం, ఇటీఎస్ పరికరాలను తిలకించారు. ఆ యంత్ర పరికరాలు భూ సర్వేలో ఏ విధంగా ఉపయోగపడనున్నాయో సంయుక్త కలెక్టర్ కిషోర్ కుమార్ వివరించారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి కృష్ణదాస్ మాట్లాడుతూ.. బ్రిటిష్ హయాంలో భూసర్వే జరిగిన తర్వాత రాష్ట్రంలో ఇప్పటివరకు మళ్లీ జరగలేదని, దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం సుమారు 1000 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును 2023 అక్టోబరు నాటికి పూర్తిచేయడానికి గడువుగా నిర్ణయించామన్నారు. పటిష్టమైన రీతిలో సర్వే జరిగేందుకే మూడేళ్ల కాలవ్యవధిని నిర్ణయించామన్నారు.