రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో భవన నిర్మాణాలకు ఇసుక సరఫరా చేస్తుండగా.. విజయనగరం జిల్లాలో మాత్రమే కేవలం ప్రభుత్వ పనులకే ఇస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా ఇసుక అవసరమైతే పక్కనున్న శ్రీకాకుళం జిల్లా నుంచి అనుమతులు తీసుకొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మూడో విడత లాక్‌డౌన్‌లో నిర్మాణ పనులకు మినహాయింపు ఇచ్చినా ఇసుక కొరత అవరోధంగా మారింది. పనులు లేక ఆ రంగంపై ఆధారపడిన వారు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో భవన నిర్మాణ రంగంపై 1.50 లక్షల మంది ఆధారపడగా.. కార్మిక శాఖ కార్యాలయంలో 1.08 లక్షల మంది కార్మికులుగా పేర్లు నమోదు చేస్తున్నారు.
స్తంభించిన పనులు..
జిల్లాలో 72 ఇసుక రేవులను గుర్తించిన అధికారులు 65 రేవుల నుంచే ఇసుక లభ్యత ఉందని ఫిబ్రవరి వరకు సరఫరా చేశారు. కొన్నిరోజుల పాటు నిర్మాణ పనులు కొనసాగాయి. తరువాత లాక్‌డౌన్‌తో స్తంభించిపోయాయి. ప్రస్తుతం జిల్లాలోని రేవుల నుంచి లభ్యత ఉన్నా భవన నిర్మాణాలకు సరఫరా చేస్తే.. ప్రభుత్వ పనులకు ఇబ్బంది వస్తుందని వారికి నిలిపివేశారు. దీనిపై కార్మికులు పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా, నిరసనలు తెలిపినా ప్రయోజనం లేకపోయింది. లాక్‌డౌన్ కాలంలో పనులు లేని కారణంగా తమకు రూ.10 వేల చొప్పున భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
నల్లబజారులో కావాల్సినంత..
ఇంత కొరత సమయంలోనూ నల్లబజారులో కావాల్సిన ఇసుక దొరుకుతుండటం గమనార్హం. మరోవైపు అక్రమమార్గాల్లో నిత్యం తరలిపోతోంది. ఇందుకు అక్రమార్కులు అర్ధరాత్రి సమయాన్ని ఎంచుకుంటున్నారు. ప్రభుత్వ పనుల కోసం సరఫరా చేసే ఇసుకను కూడా మధ్యలో దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ వాహనాలకు జీపీఎస్ లేకపోవటంతో పాటు పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వస్తున్నాయి. మే 5న ఎల్‌కోట మండలం సుందరపేట వద్ద భారీగా ఇసుక నిల్వలు పట్టుకున్నారు. భోగాపురం మండలంలో చంపావతి నది వద్ద అక్రమ నిల్వలు వెలుగు చూశాయి. చాలామంది వ్యవసాయ భూములు, నిర్జన ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు.
- జిల్లాలో కేవలం ప్రభుత్వ పనులకే ఇసుక సరఫరాకు కలెక్టర్ అనుమతించారు. ఇసుక రేవుల నుంచి ప్రభుత్వ పనులకు సరఫరా చేస్తున్నాం. ఇళ్లు, ప్రైవేటు భవనాలు నిర్మాణం కోసం ఇసుక కావాలంటే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని శ్రీకాకుళం జిల్లా నుంచి తెచ్చుకోవాలి. ఇసుక అక్రమంగా తరలించడం, నిల్వచేయడం వంటి వాటిపై సమాచారం రాగానే పట్టుకుంటున్నాం.’’ - ఎస్.వి.రమణ, భూగర్బ గనులశాఖ, సహాయ సంచాలకులు, విజయనగరం
- ఇసుకను గిరాకీ వస్తువుగా మార్చేశారు. జిల్లాలో రేవులున్నా సరఫరా చేయడం లేదు. పనులు లేక భవన నిర్మాణ కార్మికులు పస్తులుంటున్నారు. ప్రభుత్వం ఇసుక సరఫరా చేయడంతో పాటు లాక్‌డౌన్ కాలంలో పనులు లేకపోవడంతో ఆర్థిక సాయం అందించాలి.’’. - మజ్జి ఆదిబాబు, భవన నిర్మాణ కార్మికుల సంఘ అధ్యక్షుడు
- భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. నూతన ఇసుక విధానంతో ఉపాధికి గండిపడింది. లాక్‌డౌన్ సమయంలో పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు మినహాయింపు ఇచ్చినా ఇసుక సరఫరా లేక పనులు ప్రారంభం కాలేదు. పరిస్థితి ఎప్పుడు మెరుగుపడుతుందో.. ఎప్పుడు కష్టాలు తీరుతాయో తెలియడం లేదు.’’. - పాలూరి అప్పలనాయుడు, తాపి మేస్త్రీ,
ఇదీ చదవండి:అమ్మా.. అని పిలిపించుకోకముందే.. ఆ తల్లి..