చిన్న గ్రామం నుంచి పెద్ద పట్టణాల వరకూ...ఎక్కడ చూసినా...చవితి వేడుకలే. విజయనగరం జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం ఆ ఆనవాళ్లే కనిపించడం లేదు. ఎవరిని కదిపినా... వేడుకలు వద్దు అనే మాట. ఎందుకు అని ప్రశ్నిస్తే..కలిసి రావడం లేదనే సమాధానం. ఏం కలిసి రావడం లేదంటే...గ్రామస్థులు చెప్పారు చరిత్ర.
ఆ గ్రామం...వినాయక చవితికి దూరం..ఎందుకంటే..! - people from vijayanaram
చవితి పండగొస్తే...ఊరువాడా ఉత్సవం. భక్తితో భజనలు. ఇదే మనకు తెలుసు..కానీ ఓ గ్రామం మాత్రం అందుకు భిన్నం. అసలు పండగే జరుపుకోదు. దశాబ్దాలుగా వినాయక చవితి వేడుకలకు దూరంగా ఉంటోంది. ఎందుకు? ఏంటా చరిత్ర?
విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలో లచ్చిరాజుపేట గ్రామం ఉంది. దశాబ్దాలుగా వినాయక చవితి వేడుకలకు దూరంగా ఉంటోంది గ్రామం. పదిహేనేళ్ల క్రితం వినాయక చవితి పండగ నిర్వహించే ప్రయత్నం చేస్తుండగా..ఓ వ్యక్తి కన్ను ముశారు. మరుసటి ఏడాది ప్రయత్నిస్తుండగా మరొకరు చనిపోయారు. ఇలా వరుసగా మూడుసార్లు జరగడంతో వినాయక చవితి కలిసి రావడం లేదనే అభిప్రాయానికి వచ్చారు గ్రామస్థులు.
అయితే..ఈ ఏడాది నిర్వహించాలని యువకులు చాలా ప్రయత్నించారు. ఇకపై ఎలాంటి ఆటంకాలు లేవనుకునే తరుణంలో ఓ పెద్దావిడ కాలం చేశారు. మళ్లీ కథ మెుదటికే రావడంతో విరమించుకున్నారు. ఇతర పండగలకు ఇలాంటి ఆటంకాలేవీ లేవని చెబుతున్నారు గ్రామస్థులు. ఇక ముందు చవితి వేడుకల ఆలోచన లేదంటున్నారు.