జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కార్పొరేషన్‌తో పాటు సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగరపంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 160 వార్డులు ఉండగా.. పార్వతీపురంలో ఆరు, బొబ్బిలిలో ఒక వార్డు ఏకగ్రీవమైంది. విజయనగరం ఐదో డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి మృతితో పోలింగ్ ఈ నెల 12కి వాయిదా వేశారు. మిగిలిన 152 వార్డుల్లో 473 మంది అభ్యర్ధులు బరిలో నిలవగా.. 371 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని.. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు.
ఉదయం 11 గంటలకు 35% పోలింగ్..
బొబ్బిలి పురపాలన సంఘం ఎన్నికల్లో ఓట్లు వేయడానికి ఓటర్లు పోటెత్తారు. ఉదయం 11 గంటలకు 35% పోలింగ్ నమోదైంది. వృద్ధులు, దివ్యాంగులు సైతం కుటుంబ సభ్యులు సహాయంతో పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓట్లు వేశారు. పాత బొబ్బిలి, గొల్లపల్లి, మల్లంపేట ప్రాంతాల్లో ఓటర్లు బారులుతీరారు. కరోనా నిబంధనలు పాటించకుండా జనం గుమిగూడటంతో ఓటు వేసేందుకు కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు. సీఐ ఆధ్వర్యంలో బృందాలు పర్యటించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్..
మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయనగరం కార్పొరేషన్ పరిధి కణపాక యూత్ హాస్టల్ లోని పోలింగ్ కేంద్రం ఐదో బూత్‌లో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్లు స్వేచ్చాయుతంగా ఓటింగ్‌లో పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు వెల్లడించేందుకు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఓటు వేసిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు..
కేంద్ర మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు విజయనగరం కార్పొరేషన్ పరిధిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కార్పొరేషన్ పరిధి 39వ డివిజన్ సాలిపేటలోని గురజాడ పాఠశాల పోలింగ్ కేంద్రంలో అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. సాధారణ ఓటరులా.. వరుసలో నిలబడి.. ఓటు వేయటం అందరిని ఆకట్టుకుంది. ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవచ్చని.. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఓటుని వినియోగించుకోవాలని అశోక్ గజపతిరాజు కోరారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కోలగట్ల..
నగరపాలక ఎన్నికల్లో భాగంగా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఓటు వేశారు. 31వ డివిజన్ జొన్నగుడ్డి ప్రాథమిక పాఠశాల పొలింగ్ సెంటర్లో.. సతీమణితో పాటు కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సాలూరులో పోలింగ్..
సాలూరు పురపాలక సంఘ ఎన్నికలుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు.