విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడివాడ గ్రామంలో మహిళ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో నిందితుడు రాంబాబును అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ వెల్లడించారు. దిశా యాప్ సాయంతో నిందితుడిని కృష్ణాపురం గ్రామంలో అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ఘటనలో ప్రధాన నిందితునికి సహకరించినవారెవరున్నారు అన్న దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
ఒక బైక్ నుంచి నిందితుడు ముందస్తు ప్రణాళిక ప్రకారం పెట్రోల్ తీసి, బాధితురాలిపై పోసినట్లు విచారణలో నిర్థారణ అయినట్లు ఎస్పీ తెలిపారు.
బాధితురాలి మీద అనుమానంతో..
ఎనిమిది నెలల క్రితం బాధితురాలితో నిందితుడికి ఎంగేజ్ మెంట్ అయింది. పెద్దలు ఇద్దరికీ పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. ఆ తరువాత నిందితుడికి.. బాధితురాలి మీద అనుమానం వచ్చింది. తరచు ఆమె వేరే వ్యక్తితో మాట్లాడుతోందని నిందితుడు కక్ష పెంచుకున్నాడు. రెండు కుటుంబాల మధ్య స్పర్థలు వచ్చాయి. అన్నింటినీ పక్కన పెట్టి రెండు నెలల క్రితం పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ లో రాజీ కుదుర్చుకున్నారు. ఈ రాజీ ప్రకారం ఎలాంటి గొడవలు లేకుండా పెళ్లి చేసుకోవడానికి నిందితుడు కూడా అంగీకరించాడు. అయినప్పటికీ మనసులో సందేహాం పెట్టుకున్న నిందితుడు..బాధితురాలిపై పెట్రోల్ పోసి హత్య చేసేందుకు యత్నించాడు.
విజయనగరం జిల్లాలో సంచలనం రేకెత్తించిన సంఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. దిశా యాప్ ను ఉపయోగించి నిందితుడ్ని పట్టుకున్నారు.