పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన కింద సమగ్ర జలయాజమాన్య పథకాన్ని అమలు చేస్తున్నారు. 2012లో మంజూరైన ఈ పథకం పనులను ఏడేళ్ల కాల వ్యవధిలో పూర్తి చేయాలి. 2013-14లో ప్రారంభించిన నేపథ్యంలో 2021 మార్చి నాటికి అవ్వాలి. అంటే మరో ఆరునెలల వ్యవధిలో పనులన్నీ పూర్తి చేయాలి.
పార్వతీపురం, న్యూస్‌టుడే
గిరిజన ప్రాంతంలో అమలు చేస్తున్న పథకం కావడంతో సాంకేతిక సిబ్బందిగా దాదాపుగా గిరిజన యువతనే తీసుకున్నారు. సాంకేతిక అర్హతల ప్రమేయం లేకుండానే వారిని నియమించడం వల్ల అవసరానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకొని పథకంలో భాగస్వామ్యం చేశారు. పర్యవేక్షణకు సంబంధించి అదనపు పథక సంచాలకుడిని నియమించారు. అయితే ఆయన ఎక్కువ సమయం ఇతర బాధ్యతల్లో కొనసాగడంతో పర్యవేక్షణ కొరవడి ప్రగతి కొంత వెనుకంజ వేసింది. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.65 కోట్లలో అగ్రభాగం అంటే 56 శాతం మొత్తాన్ని సహజవనరుల అభివృద్ధికి వినియోగించాలి. ఈ నిధులతో భూసార పరిరక్షణ, నీటి వినియోగం వంటి వాటిని అమలు చేయాల్సి ఉంది. రూ.36 కోట్ల్ల భారీ మొత్తాన్ని దీనికి వెచ్చించాలి. ఇప్పటివరకు రూ.18 కోట్ల విలువైన పనులు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. వాటిని ఆరు నెలల్లో పూర్తిచేయాల్సిన అవసరం ఉంది. కానీ చెల్లింపుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో వాటి నిర్వహణకు వెనుకడుగు వేస్తున్నారు.