రాష్ట్ర పండుగగా గుర్తింపు
పూసపాటిరాజుల ఆడపడచు అయిన పైడితల్లి అమ్మవారి జాతరను ప్రతీ ఏడాది వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తలైన పూసపాటి రాజవంశీయులు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ పండుగను రాష్ట్ర పండగగా గుర్తించటంతో ఈ ఏడాది నుంచి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మహోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై ఇప్పటికే మంత్రులు బొత్స సత్యనారాయణ, పుష్పశ్రీవాణి అధికారులతో సమీక్షించారు. అమ్మవారి పండుగకు సంబంధించిన ఏర్పాట్లన్నీ తుదిదశకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు.
ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు..
అమ్మవారి ప్రధాన పూజారి నివసించే ప్రాంతమైన హుకుంపేటలో సిరిమాను రూపుదిద్దుకుంటుంది. అక్కడనుంచి ఈ సిరిమానును.... సిరిమానోత్సవం నాడు అమ్మవారి చదురుగుడి వద్దకు మేళతాళాలు, సాంస్కృతిక కళారూపాల నడుమ సంప్రదాయబద్దంగా తీసుకువస్తారు. అనంతరం అమ్మవారి రూపంగా ఆలయ ప్రధాన పూజారి సిరిమానును అధిరోహిస్తారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గడ్ రాష్ట్రాల నుంచీ భక్తులు వస్తారు.