కొవిడ్ బాధితుల చికిత్స కోసం విజయనగరం జిల్లాలో ప్రస్తుతం సుమారు 700 ఆక్సిజన్ పడకలున్నాయి. ఈ పడకలకు నిత్యం సుమారు 8.7 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమవుతోంది. ఒక్క జిల్లా కేంద్రాస్పత్రిలోనే సుమారు 200 పడకలు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి పైప్ లైన్ల ద్వారా లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. ఇంతకు ముందు ఇక్కడ ఒక కిలోలీటర్ సామర్ధ్యమున్న రెండు ఆక్సిజన్ ట్యాంకులు ఉండేవి. కొత్తగా 10 కేఎల్ సామర్థ్యంగల ట్యాంకును ఇటీవలే ప్రారంభించారు. ఈ ట్యాంకు నిర్మాణానికి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తన నిధుల నుంచి 20 లక్షల రూపాయలు కేటాయించారు.
ఇటీవల జిల్లా కేంద్రాసుపత్రిలో చోటుచేసుకున్న సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకున్న చర్యల్లో భాగంగా నూతన ఆక్సిజన్ ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు. మిమ్స్ కొవిడ్ ఆసుపత్రిలో 13 కిలోలీటర్ల ఆక్సిజన్ ట్యాంకును, పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో 6 కేఎల్ ట్యాంకు ఏర్పాటు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ట్యాంకును ఒకసారి నింపితే, సుమారు 48 గంటలపాటు సరిపోతుంది. జిల్లాలో మిగిలిన 70 శాతం ఆక్సిజన్ పడకలు డి- టైప్ సిలిండర్ల మీదనే ఆధారపడి ఉన్నాయి. వీటికి సరఫరా చేసే ఒక్కో సిలిండర్‌లో 7 మెట్రిక్ క్యూబిక్కుల ఆక్సిజన్ పడుతోంది. వీటి ద్వారానే దాదాపు 500 పడకలకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు.
బొబ్బిలి పారిశ్రామికవాడలో రెండు ఆక్సిజన్ ఫిల్లింగ్ పరిశ్రమలను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో సోనీ ఎంటర్ప్రైజెస్, శ్రీ సాయి శ్రీనివాస గ్యాసెస్ ఆక్సిజన్ ఫిల్లింగ్ పరిశ్రమల్లో ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతోంది. ఇక్కడి నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు కేవలం గంటలోనే ఎక్కడికైనా ఆక్సిజన్‌ను సరఫరా చేయగలుతున్నారు. రోజువిడిచి రోజు జిల్లాకు 10 కిలోలీటర్ల ఆక్సిజన్ ట్యాంక్ వస్తోందని, దీనితో రోజుకు సుమారు 500 సిలిండర్ల ఫిల్లింగ్ జరుగుతోందని అధికారులు చెప్పారు.
జిల్లాలో ప్రస్తుతం రోజుకు సుమారుగా 450 వరకూ సిలండర్లు అవసరం అవుతున్నాయని, ఆ మేరకు నిరాటంకంగా ఉత్పత్తి చేసేందుకు అధికారులు బొబ్బిలి పారిశ్రామిక వాడలో ఏర్పాట్లు చేశారు. ఉత్పత్తి పర్యవేక్షణకు ముగ్గురు నోడల్ అధికారులను నియమించామని, ఆయా ఆసుపత్రులు ముందుగా నోడల్ అధికారులను సంప్రదించి, తమకు కావాల్సిన ఆక్సిజన్ సిలండర్లను తీసుకువెళ్లే అవకాశాన్ని కల్పించామని అధికారులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి పార్వతీపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి నేరుగా ఆక్సిజన్ సరఫరా అవుతోంది. జిల్లాలోని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు బొబ్బిలి నుంచి ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.