కరోనా కష్టకాలంలో రోగులను ఆదుకునేందుకు స్వామన్న ప్రాణవాయువు రథాన్ని ప్రారంభించినట్లు వైకాపా రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి చెప్పారు. కొవిడ్ బాధితులకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. విజయనగరంలో వైకాపా యువజన నాయకుడు ఈశ్వర్ కౌశిక్, కౌన్సిలర్లు, పార్టీ నేతలతో కలిసి ప్రాణవాయువు రథాన్ని లాంఛనంగా మొదలుపెట్టారు. ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచామని.. అవసరమైన వారికి ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు.
ఖాళీ అయిన వాటిని వెంటనే తమ వద్దకు తీసుకువస్తే.. ప్రాణవాయువుతో నింపి మరల వారికి అందజేస్తామని తెలిపారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా.. సమస్య పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. అవసరం ఉన్నవారు 9440888882, 08922233466 నెంబర్లను సంప్రదించాలని కోరారు. విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రి సలహా మండలి సభ్యుడు అడారీ నగేశ్, సోషల్ మీడియా కన్వీనర్ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.