Pension is the rights : విశాఖ నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల ప్రజా సంఘాల ఐక్యవేదిక పింఛనుదారుల సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల నియోజకవర్గం పీడీఎఫ్ అభ్యర్థి డాక్టర్ కోరుట్ల రమప్రభ మాట్లాడారు. నూతన పింఛన్ విధానం విశ్రాంత ఉద్యోగులకు ఎంత మొత్తం వస్తుందో, ఉద్యోగానంతర ఆర్థిక సౌకర్యాలు ఏ మేరకు వర్తిస్తాయో ఈ విధానంలో నిర్దిష్టంగా లేవని వెల్లడించారు. ఉద్యోగులు చెల్లించే మొత్తాన్ని షేర్ మార్కెట్లో ఉంచి తద్వారా వచ్చిన మార్పుల మేరకు పింఛను నిర్ణయించే విధానం వల్ల విశ్రాంత ఉద్యోగులకు ఇబ్బందులు వస్తున్నాయని రమాప్రభ వెల్లడించారు.
ఈనెల 26న రాష్ట్రస్థాయి సదస్సు..: పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ విజయవాడలో ఈ నెల 26వ తేదీన రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్టు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ రెడ్డి వెంకట్రావు తెలిపారు. దేశవ్యాప్తంగా పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు విశ్రాంత ఉద్యోగులతో పాటు అనేక ప్రజాసంఘాలు సమాయత్తమవుతున్నాయన్నారు.
కేంద్ర వైఖరిలో మార్పు వచ్చేంత వరకు ఉద్యమం..: కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చేంతవరకు ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగిస్తామని ఆయన వివరించారు. సదస్సులో శాసనమండలి పూర్వ సభ్యుడు ఎంవీఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలి..:పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలంటూ ప్రజాసంఘాలు కొన్నేళ్లుగా ఉద్యమించాయి. పాత పింఛన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పింఛన్ విధానాన్ని అమలు చేయడంతో ఉద్యోగులు తీవ్రంగా నష్ట పోతున్నారని ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో పాత పింఛన్ విధానం అమలు ఆవశ్యకతను ప్రస్తావిస్తున్నారు.