ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్లు కూల్చివేత.. రోడ్డున పడ్డ భోగాపురం నిర్వాసితులు - Bhogapuram Latest News

Bhogapuram Airport : విమానాశ్రయ నిర్మాణం కోసం వారసత్వంగా వస్తున్న స్థిరాస్తులను వదులుకున్నారు. గ్రామాలతో అనుబంధాన్ని తెంచుకునేందుకు సిద్ధమయ్యారు. విమానాశ్రయం పనులు ఏ మేరకు సాగుతున్నాయో తెలీదు కానీ.. ఈలోగా ఉన్నపళంగా ఇళ్లు ఖాళీ చేయాలంటూ మీద పడ్డారు. కాస్త సమయమిస్తే స్వయంగా ఖాళీ చేస్తామని వేడుకున్నా ఖాతరు చేయకుండా.. ఖాళీ చేయాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. పునరావాసం పూర్తికాకుండా ఎక్కడికి వెళ్లాలో తెలియక.. భోగాపురం విమానాశ్రయం నిర్వాసితులు రోడ్డునపడ్డారు.

Bhogapuram residents
భోగాపురం నిర్వాసితులు

By

Published : Feb 12, 2023, 7:45 AM IST

Updated : Feb 12, 2023, 8:41 AM IST

ఇళ్లు కూల్చివేత.. రోడ్డున పడ్డ భోగాపురం నిర్వాసితులు

Bhogapuram Protest : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అవసరమైన 2 వేల 200 ఎకరాల భూమితో పాటు మరో 500 ఎకరాలను అదనంగా.. విజయనగరం జిల్లా నుంచి ప్రభుత్వం సేకరించింది. మరడపాలెంలో 223, ముడసర్లపేటలో 33, బొల్లింకలపాలెంలో 55, రెల్లిపేటలో 85 కుటుంబాలవారు నిర్వాసితులయ్యారు. వీరికి నిర్మించి ఇవ్వాల్సిన పునరావాస కాలనీల్లోని గృహాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఈలోగానే మీకిచ్చిన గడువు ముగిసింది.. వెంటనే గ్రామాలు విడిచి వెళ్లాలంటూ రెవెన్యూ అధికారులు నిర్వాసితులను హెచ్చరించారు.

ఇందులో భాగంగా నిర్వాసిత గ్రామాల్లో ఒకటైన మరడపాలెంలో.. ఇళ్లు కూల్చేందుకు శుక్రవారం జేసీబీలతో అధికార యంత్రాంగం బరిలోకి దిగింది. నిర్వాసితులు, ప్రతిపక్షాల నిరసనలతో వెనుదిరింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన ముగ్గురు నిర్వాసితుల ఇళ్లను మాత్రమే తొలగించారు. శనివారం కూడా అధికారులు మరడపాలేనికి యంత్రాలు, జేసీబీలతో రాగా శుక్రవారం నాటి పరిస్థితే పునరావృతమైంది. రెల్లిపేట, బొల్లింకలపాలెం, ముడసర్లపేట గ్రామాల్ని ప్రజలు ఖాళీ చేశారు. మీరెందుకు ఖాళీ చేయరంటూ అధికారులు, పోలీసు బలగాలతో మరోసారి రంగప్రవేశం చేశారు. నయానో భయానో గ్రామస్థులను లొంగదీసుకునే ప్రయత్నం చేశారు.

చాలా మందికి పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని.. ఇంతలో ఊరు వదిలి పొమ్మంటే ఎక్కడికి వెళ్లాలని.. బాధితులు ప్రశ్నిస్తున్నారు. పునరావాస కాలనీల్లో పూర్తిస్థాయి వసతులు కల్పించి, ఇళ్లు ఖాళీ చేయించాలని కోరుతున్నారు.

"మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన భూములు, ఇళ్లు ఖాళీ చేయమంటున్నారు. వాటిని ఖాళీ చేస్తే ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామని అన్నారు. స్థలాలు ఇవ్వలేదు. భూములు ఇవ్వలేదు. ఇప్పటికి ఇప్పుడు ఖాళీ చేయమని అడిగితే మేము ఎలా ఖాళీ చేయాలి. ఎక్కడు తల దాచుకోవాలి." - సూరమ్మ, మరడపాలెం

తెలుగుదేశం నేత బంగార్రాజు, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ సత్యనారాయణ, జనసేన నాయకులు మాధవి సహా పలువురు నాయకులు.. అధికారుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. పునరావాసం పూర్తికాకుండానే హడావుడిగా నిర్వాసితులను ఎలా తరలిస్తారని.. ఆర్డీవో సూర్యకళని ప్రశ్నించారు. ఇప్పటికే చాలా సమయమిచ్చామని.. ఇక ఖాళీ చేయక తప్పదంటూ ఆమె నాయకులపైనే ఎదురుదాడి చేశారు. అధికారుల హెచ్చరికలతో తీవ్ర ఆందోళకు గురవుతున్న నిర్వాసితులు.. ఎక్కడికి వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు.

"విమానాశ్రయానికి భూములిచ్చిన వారికి వారం రోజుల నుంచి కంటి నిండా కునుకు లేదు. ఇదంతా అధికారులు చోద్యం చూస్తున్నారు తప్పా వారి గోడు పట్టించుకోవటం లేదు. విమానాశ్రయ పని పూర్తయ్యింది. మీ గ్రామం వల్లనే పని ఆగిపోయింది అనే సమయంలో.. ఖాళీ చేయించిన పరవాలేదు. కానీ, ప్రభుత్వానికి రావాల్సిన నగదు తెచ్చుకోవటం కోసం ఈ గ్రామాన్ని ఖాళీ చేయించటం.. ఎంత వరకు సమంజసం."-బంగార్రాజు, టీడీపీ నేత

ఇవీ చదవండి :

Last Updated : Feb 12, 2023, 8:41 AM IST

ABOUT THE AUTHOR

...view details