వానాకాలం వస్తే ఆ గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు కట్..! వర్షాకాలం మూడు నెలలు ఎప్పుడెప్పుడు ముగుస్తుందా అని ఉత్తరాంధ్రవాసులు ఎదురుచూస్తుంటారు. వాగులు, వంకలు పొంగితే.. ఇక్కడి గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతుంటాయి. వంతెనలు లేక వైద్య సదుపాయాలు సకాలంలో అందని సందర్భాలు ఎన్నో. విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి అవస్థలు పడుతుంటారు. ఏళ్లతరబడి అవస్థలు పడుతున్న ఇక్కడి గ్రామాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
ఏళ్ల తరబడి వంతెనల నిర్మాణం
విజయనగరం జిల్లాలో నాగావళి, వేగావతి, స్వర్ణముఖి, చంపావతి, గోస్తని ప్రధాన నదులు. ఈ నదులు ఒడిశా, ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో జన్మించి, విజయనగరం జిల్లాలో ప్రవహిస్తూ... బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ నదులే జిల్లా ప్రజలకు ప్రధాన నీటి వనరులు. వీటికి అనుబంధంగా పలు వాగులు, వంకలు జిల్లాలో ప్రవహిస్తున్నాయి. ఈ నదుల పరివాహక ప్రాంతాల్లో ఏళ్ల తరబడి వంతెనలు నిర్మించకపోవటం, సమీప గ్రామాలకు శాపంగా మారింది.
సౌకర్యాలు బంద్
నదుల ప్రవాహలు తగ్గే వరకు ఈ గ్రామాలకు బాహ్య ప్రపంచానికి దూరంగా గడుపుతుంటారు. వైద్య, రవాణా సేవలు సైతం అందవు. ప్రధానంగా... తెర్లాం మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే వేగావతి నదిని దాటాల్సిన పరిస్థితి. కొత్త కుసుమూరు, రామన్నవలస, చినందబలగ గ్రామాల ప్రజలు నందబలగ, కుసుమూరు, పినపెంటి, కారాడ గ్రామాలకు రావాలంటే నదిలో దిగిరావల్సిందే. పాచిపెంట మండలంలో కర్రివలస గ్రామ సమీపాన పోతులగెడ్డ నదిపై చేపట్టిన వంతెన పనులు పడకేశాయి. పోతుగెడ్డ, కొండవాగు ప్రవాహంతో పాచిపెంట, పద్మాపురం, కేసలి, కొటికిపెంట తదితర పంచాయతీలకు రాకపోకలు స్తభించిపోయాయి.
జిల్లాలోని గిరిజన గ్రామాల ప్రజల అవస్థలు వర్ణనాతీతం. కొమరాడ మండలం నాగావళి నదికి ఒక వైపు 33 గ్రామాలున్నాయి. వర్షాకాలం మూడు నెలలు ఈ గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. ఈ కాలంలో విద్యార్థులు కళాశాలలు, పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి.
వంతెనలు లేని స్థితిలో నదులు, వాగులను దాటుతూ అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. 1996లో కోమరాడ మండలం నాగావళి నదిలో సరుగుడుగూడ వద్ద పడవ ప్రమాదం జరిగి 33మంది మరణించారు.
వంతెనలు నిర్మించాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఈ సమస్యతీరడం లేదు. ఇప్పటికైనా పాలకులు.. ప్రజల అవస్థల్ని అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
ఇదీ చదవండి: నాగావళిలో పెరిగిన నీటి ప్రవాహం..విద్యార్థుల అవస్థలు