ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బడుల స్వరూపం మార్చామంటూ ప్రచారం.. కానీ నాణేనికి రెండో వైపు..! - శిథిలావస్థలో ఉన్న భవనాల్లో పాఠశాల నిర్వహణ

Schools Issues : కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే రీతిలో సౌకర్యాలు.. డిజిటల్ క్లాస్‌రూంలు, విద్యార్థులు కూర్చునేందుకు బల్లలు, మినరల్ వాటర్‌, మరుగుదొడ్ల ఏర్పాటు.. ఇదీ నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల స్వరూపం పూర్తిగా మార్చేశామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొడుతున్న ప్రచారం. ప్రైవేట్ పాఠశాలలను కాదని.. సర్కార్‌ బడులకే విద్యార్థులు తరలివస్తున్నారంటూ గొప్పగా పత్రికల్లో ప్రకటనలు సైతం ఇస్తున్నారు. ఇవన్నీ నాణేనికి ఒకవైపే.. సాక్ష్యాత్తూ విద్యాశాఖ మంత్రి సొంత జిల్లాలోని పాఠశాలల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 9, 2023, 4:37 PM IST

నాణేనికి రెండో వైపు..

Schools Issues: విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉంది. నాడు-నేడు పథకం కింద పాఠశాలల్లో అధునాతన వసతులు, నాణ్యమైన భోజనం, విశాలమైన ఆట స్థలాలు నిర్మించామని ప్రభుత్వం చెబుతుండగా... విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లాలో మాత్రం పాఠశాలలు ఏ నిమిషంలోనైనా కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. పెచ్చులూడిపోతున్న భవనాల్లో పాఠాలు చెప్పేందుకు భయపడిపోతున్న ఉపాధ్యాయులు.. సమీపంలోని అద్దె ఇళ్లల్లో అరకొర సౌకర్యాలతోనే నెట్టుకొస్తున్నారు. మరికొన్ని పాఠశాలలు మాత్రం శిథిల భవనాల్లోనే కొనసాగిస్తున్నారు.

కొత్తూరు ప్రాథమిక పాఠశాలలో 29 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాల భవనం కూలిపోయేలా ఉండటంతో గతేడాది అక్టోబర్‌ 20న మూసివేశారు. సమీపంలోని ఓ పెంకుటింట్లో పాఠశాల నిర్వహిస్తున్నారు. పిన్నింటిపాలెం ప్రభుత్వ పాఠశాలలో 19 మంది విద్యార్థులు ఉండగా ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో.. రేకుల షెడ్డులోకి మార్చారు. పాతచెరుకుపల్లిలోనూ ఇదే పరిస్థితి తలెత్తడంతో.. గ్రామ సర్పంచ్ బంధువులకు చెందిన షాపింగ్‌ కాంప్లెక్స్‌లోకి మార్చారు. జాతీయ రహదారి విస్తరణలో నారుపేట ప్రాథమిక పాఠశాల భవనం తొలగించడంతో.. ఈ పాఠశాలను రేకుల షెడ్డులో నడుపుతున్నారు.

భోగాపురం మండలంలో కొత్తూరు, పిన్నింటిపాలెం, పాతచెరుకుపల్లి, చెరువుకొమ్ము గొల్లపేట, ఎరుసుపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించి ప్రమాదకరమని నివేదిక ఇచ్చారు. ఎరుసుపేట, చెరువుకొమ్ము గొల్లపేట పాఠశాలలు మాత్రం శిథిల భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. ఇలాంటి బడులకు తమ పిల్లలను ఎలా పంపాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details