గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందకపోవడానికి రహదారుల సమస్యే ప్రధాన కారణమని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి అన్నారు. విజయనగరం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్లను పుష్పశ్రీవాణి ప్రారంభించారు. రహదారులను అభివృద్ధి చేస్తే గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఈఐ రోడ్ల పథకంలో రూ.102.68కోట్లు, నాబార్డ్ పథకంలో రూ.95.07 కోట్లు, ఉపాధి హామీ బీటీ రోడ్ల పథకంలో రూ.429 కోట్లు, డబ్ల్యుబీఎం రోడ్ల పథకంలో రూ.606 కోట్ల చొప్పున గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలకు మొత్తం రూ.1232.75 కోట్లను వెచ్చించామని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏజెన్సీ ఏరియాలో గిరిజన సంక్షేమశాఖ ద్వారా రహదారుల ఏర్పాటుకు, అదనపు భవనాల నిర్మాణానికి రూ.130.46 కోట్లను మంజూరు చేశామన్నారు.
వివిధ ఐటీడీఏల పరిధిలో ఉన్న అనేక గిరిజన ఆవాసాలకు... తరతరాలుగా రహదారి సౌకర్యాలు లేకపోవడంతో అత్యవసర వేళల్లో ఆంబులెన్స్‌లు కూడా వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రోడ్లు లేని గిరిశిఖర గ్రామాలకు ముందుగా రోడ్ ఫార్మేషన్ పనులు చేపట్టడానికి... 6 ఐటీడీఏల పరిధిలో 236 రోడ్ ఫార్మేషన్ పనుల కోసం రూ.23.50 కోట్లు మంజూరు చేశామని పుష్ప శ్రీవాణి వివరించారు. ఈ పనులన్నీ పూర్తయితే గిరిశికర గ్రామాల నుంచి అత్యవసర సమయాల్లో రోగులు, బాలింతలను డోలీలలో తరలించే సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డారు.