నాడు - నేడు పథకం కింద నిధులు సమకూర్చటంతో విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని గొల్లపేట కుమ్మరివీధి ప్రాథమిక పాఠశాల దశ తిరిగింది. ప్రభుత్వ నిధులతో పాటు., ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో ఆ పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలా సదుపాయాలు సమకూరాయి. నగరపాలక సంస్థ పరిధిలో నాడు - నేడు కార్యక్రమం తొలివిడతలో భాగంగా మెుత్తం 14 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో 11 ప్రాథమిక పాఠశాలలు కాగా.., మిగిలినవి మూడు ఉన్నత పాఠశాలలు. వీటి మరమ్మతుల కోసం 2.42 కోట్లు వెచ్చించారు.
పచ్చదనం సంతరించుకునే విధంగా పాఠశాల ఆవరణను తీర్చిదిద్దారు. విద్యార్థులందరికీ బల్లలతో పాటు., ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశ్రుభతను అలవర్చే క్రమంలో భాగంగా చేతులు, మధ్యాహ్న భోజన ప్లేట్లు శుభ్రం చేసుకునేందుకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాతల సహకారంతో.. తాగడానికి శుద్ధజలాన్ని అందిస్తున్నారు. పాఠశాల మొత్తాన్ని వివిధ రంగులతో ఆకర్షణీయంగా మార్చారు. విద్యాభివృద్ధికి తోడ్పే విధంగా వివిధ రకాల బొమ్మలు, తెలుగు, ఆంగ్ల వర్ణమాలలు, రోజువారి కృత్యాలు, వివిధ వృత్తులు, తెలుగు నెలలు, మాసాలు, పద్యాలు, సామెతలు, కవితలు, సూక్తులు రాయించారు. పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన అంశాలన్నింటినీ చక్కగా గోడలపై చిత్రీకరించారు. ఈ నూతల హంగులతో పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య 120 నుంచి 200లకు చేరింది.
"పాఠశాలను సర్వాంగ సుదంరంగా తీర్చిదిద్దాం. విద్యార్థి పాఠశాలలో ఎక్కువ సమయం గడిపేందుకు వీలుగా పాఠశాలలో మార్పులు చేశాం. రూ. 23 లక్షలతో పాఠశాలను అభివృద్ధి చేశాం. ఇప్పుడు పాఠశాలకు వచ్చేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండేది. ఇప్పుడు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200 దాటింది."
-సురేశ్, గొల్లపేట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు