విజయనగరం జిల్లా చెరువులకు పెట్టింది పేరు. అత్యధిక చెరువుల గల జిల్లాగా రాష్ట్రంలోనే రికార్డులకెక్కింది. ఒకప్పుడు జిల్లా వ్యాప్తంగా 10వేలు ఉండే వీటి సంఖ్య ప్రస్తుతం సగానికి పడిపోయింది. చాలా వరకు ఆక్రమణలకు గురికాగా.. అరకొరగా ఉన్నవి, నిర్వాహణ కరువై కాలుష్య కారకాలుగా మారాయి. మురుగు నీటితో నిండిపోయిన వీటితో.. ప్రయోజనం కంటే, స్థానికులకు ఇబ్బందులే అధికమయ్యాయి. పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్ హరిజవహార్ లాల్ చెరువులు శుద్ధికి సంకల్పించారు. స్వచ్ఛ చెరువుల కార్యక్రమానికి పిలుపునిచ్చి, ఐదు దశల్లో అమలు చేశారు. చెరువుల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపుకు శ్రీకారం చుట్టారు. అనంతరం మురుగు నీరు చెరువుల్లోకి చేరకుండా జాగ్రత్తలు చేపట్టారు. అటుపై చెరువులకు ఇరువైపుల మెుక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమాలన్నింటిలో స్వయంగా జిల్లా కలెక్టర్ పాల్గొనడం విశేష స్పందన లభించింది.
కలెక్టర్ కృషితో నందనవనంగా చెరువులు.. పెరిగిన భూగర్భ జలాలు - విజయనగరం జిల్లాలో మన ఊరు-మన చెరువు కార్యక్రమం వార్తలు
చెరువు గట్టు జ్ఞాపకాలు లేని చిన్నతనం ఉండదంటే అతిశయోక్తి కాదు. అంతలా మన ఊరి చెరువులు మనతో అల్లుకుపోతాయి. కానీ కాలంతోపాటే చెరువులు రూపురేశలు మారిపోయాయి. చెత్త, చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి దుర్గంద భరితమైనవి కొన్నైతే.. కబ్జాలకు కనుమరుగైనవి ఇంకొన్ని. ఇలాంటి తరుణంలో మన ఊరు-మన చెరువు పేరుతో చెరువులకు పునఃవైభవాన్ని తెచ్చే ప్రయత్నం చేశారు జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్. దీంతో విజయనగరం ఖ్యాతి జాతీయ స్థాయి వేదికపై తలుక్కున మెరిసింది.
కలెక్టర్‌ను స్ఫూర్తిగా తీసుకొని గ్రామాల్లో చెరువుల శుద్ధి ఉద్యమంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా స్థానిక ప్రజలు, స్వచ్చంధ సంస్థలు, యువజన, ప్రజా సంఘాలు, విద్యార్ధులు, పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెరువులు శుద్ధి.. పచ్చదనం పెంపు కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టిన విజయనగరం వాసుల కృషికి ఫలితంగా జాతీయ స్థాయి పురస్కారం లభించింది. దిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఉపరాష్ట్రపత్రి వెంకయ్యనాయుడు జిల్లాకు జాతీయ జలశక్తి అవార్డును ప్రధానం చేశారు.
కలెక్టర్ చేపట్టిన చెరువులు శుద్ధి కార్యక్రమంతో జిల్లాకు జాతీయ జలశక్తి అవార్డు లభించటంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు. చెరువుల శుద్ధి ద్వారా జిల్లాలో 4వేల చెరువులు బాగు చేశామన్నారు. జిల్లా కేంద్రంలోనే 22 చెరువులను శుద్ధి చేసి, మొక్కలు నాటినట్లు తెలిపారు. గతంతో పోల్చితే 1.19 మీటర్ల భూగర్భ జలమట్టం పెరిగిందని, ఈ అవార్డు స్ఫూర్తితో మిగిలిన చెరువులను శుద్ధి చేసి, వినియోగంలోకి తీసుకొస్తామన్నారు.