పూసపాటి ఆనంద గజపతిరాజు 1888లో స్థాపించిన విజయనగరం.. 1988 నాటికి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ దశకి చేరుకుంది. 2019 జులై 3న కార్పొరేషన్‌గా రూపాంతరం చెందింది. మొత్తం 50 డివిజన్లతో ఏర్పడిన నగరపాలక సంస్థ.. దాదాపు 57 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. 1987, 1995, 2000లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులే.. మున్సిపాలిటీ ఛైర్మన్లుగా పాలకపగ్గాలు చేపట్టారు. 2014లో 40 వార్డుల్లో 30 వార్డులు తెలుగుదేశం గెలవగా.. ప్రసాదుల రామకృష్ణ అధ్యక్ష పీఠాన్ని చేపట్టారు. తాజాగా కార్పొరేషన్ హోదాలో ఎన్నికలు జరుగుతుండటంతో.. గెలుపెవరదన్నదానిపై ఆసక్తి నెలకొంది.
2011 జనాభాల లెక్కల ప్రకారం 2 లక్షల 44వేల 598 మంది జనాభా ఉన్నారు. ఓటర్లు 2 లక్షల 2 వేల 214 మంది ఉన్నారు. వీరిలో మహిళలు లక్ష 3 వేల 216 మంది కాగా.. పురుషులు 98 వేల 969 మంది ఉన్నారు. మొదటిసారిగా కార్పొరేషన్ హోదాలో జరుగుతున్న ఎన్నికలను అన్ని రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. గతేడాది ఎన్నికలు ప్రక్రియ నిలిచిపోయే సమయానికి దాఖలైన నామినేషన్లలో 77తిరస్కరించగా.. 336 ఆమోదం పొందాయి. మేయర్ అభ్యర్థిగా శమంతకమణిని తెలుగుదేశం ప్రకటించగా.. వైకాపా ఇప్పటివరకూ తమ మేయర్ అభ్యర్థి ఎవరన్నది బహిర్గతం చేయలేదు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో.. అధ్యక్ష, ప్రతిపక్ష నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. సానుకూల, ప్రతికూలతలను అధ్యయనం చేసి అన్నివర్గాల మద్దతు కూడగట్టేలా వ్యూహాలు రచిస్తున్నారు.