కార్పొరేషన్ స్థాయిని అందుకున్న విజయనగరం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. విద్య, వాణిజ్యపరంగానే కాకుండా పారిశ్రామికంగానూ ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా.. నగరంలోని రహదారులను విస్తరించాలని పాలకులు నిర్ణయించారు. ఈ మేరకు విజయనగరంలో 2015లో 14 రహదారుల విస్తరణకు అప్పటి పురపాలకులు శ్రీకారం చుట్టారు. ఆరేళ్ల క్రితం చేపట్టిన ఈ పనుల్లో ఇప్పటివరకు నాలుగు రహదారుల విస్తరణ పనులు మాత్రమే పూర్తయ్యాయి.
కోర్టు కేసులు, భవన యజమానుల అభ్యంతరాలు తదితర కారణాలతో మిగిలిన రహదారుల పనులు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అంబటి సత్రం, డీసీసీబీ బ్యాంకు నుంచి ఐస్ ఫ్యాక్టరీ వరకూ రహదారి, దాసన్నపేట రైతు బజారు నుంచి కొత్తపేట నీళ్లట్యాంకు, గంటస్తంభం నుంచి పాతబస్టాండు రహదారుల్లో భవనాల కూల్చివేతకు మాత్రమే పనులు పరిమితమయ్యాయి. భవన యజమానులు, స్థానికులే కాదు.. ప్రయాణికులు, వాహనదారులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు.
రహదారుల విస్తరణ విషయంలో నిబంధనల ప్రకారం.. తొలుత మార్కింగ్ ఇచ్చిన మేరకు కట్టడాలు తొలగించాలి. అవి పూర్తయ్యాక విద్యుత్తు స్తంభాలు తొలగించాలి. అనంతరం మురుగునీటి కాలువల్ని నిర్మించాలి. వాటి తర్వాత తాగునీటి పైపులైన్లు వేయాలి. ఇవన్నీ జరిగాక బీటీరోడ్డు పనులు చేపట్టాలి. ఆయా శాఖల మధ్య సమన్వయం లోపించింది. దశల వారీగా కాకుండా ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆరేళ్లుగా పనులు సాగుతుండటంతో నరకం చూస్తున్నామని స్థానికులు వాపోతున్నారు. వర్షాకాలంలో అడపాదడపా కురుస్తున్న వర్షాలకూ రోడ్డు బురదమయంగా మారటంతో నడవడానికీ ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.