MP Suresh Prabha @ Vizianagaram: నైపుణ్యతతో కూడిన విద్య ద్వారానే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని, యువతకు ఉపాధి అవకాశాలు త్వరితగతిన లభిస్తాయని రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించాలని, ప్రస్తుత సమాజ అవసరాలకు తగిన విధంగా విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని ఆయన సూచించారు. విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్మెంట్ కేంద్రానికి సురేష్ ప్రభు.. తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి 70 లక్షల రూపాయలు కేటాయించారు. ఆ కేంద్ర భవన నిర్మాణానికి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ మాధవ్, పలువురు భాజపా నేతలతో కలసి... ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం 20 లక్షల రూపాయలతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి కేటాయించిన ప్రత్యేక అంబులెన్స్‌ను జెండా ఊపి ప్రారంభించారు.
నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి: ప్రస్తుత సమాజంలో ఉపాధి రంగంలో స్థిర పడడానికి ఉపయోగపడే చదువులను అభ్యసించాలని విద్యార్థులకు ఎంపీ సురేష్ ప్రభు సూచించారు. ఉద్యోగానికి లేదా స్వయం శక్తితో ఎదగడానికి ఉపయోగపడే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని హితవు పలికారు. 1966లో హరిత విప్లవం తర్వాత వ్యవసాయ రంగంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పరిణామం ఏమీ లేదని, కావున నేటి తరం యువత కొత్తగా ఆలోచించి నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. ప్రస్తుతం 98 శాతం విద్యార్థులు డిగ్రీ పాస్ అవుతున్నారు కానీ.. నాణ్యత ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.