movie theatres seized in vizianagaram: విజయనగరం జిల్లాలోని సినిమా థియేటర్లలో.. అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా సినిమాటోగ్రఫీ చట్టం నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆరు థియేటర్లపై అధికారులు కొరడా ఝుళిపించారు.
శృంగవరపుకోటలో.. కలెక్టర్ సూర్యకుమారి.. అఖండ సినిమా ప్రదర్శిస్తున్న శ్రీనివాస మహల్‌ను తనిఖీ చేశారు. సినిమా హాలులో పరిశుభ్రత, ఆహార పదార్థాలు విక్రయించే స్టాల్స్ ను పరిశీలించారు. రోజు ఎన్ని షోలు ప్రదర్శిస్తున్నారు, టిక్కెట్ ధరలు, థియేటర్ లైసెన్సులపై ఆరా తీశారు. థియేటర్ నిర్వహణ, టికెట్ల విక్రయాలు, లైసెన్స్ విషయంలో నిబంధల మేరకు వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.
సబ్ కలెక్టర్ భావన.. పార్వతీపురం మండలం నర్సిపురంలోని టీ.బీ.ఆర్ సినిమా హాల్ లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కొత్తవలసలోని శ్రీజయా, లక్ష్మీనరసింహా, రాజా పిక్చర్ ప్యాలస్ థియేటర్లను.. విజయనగరం ఆర్డీవో భవానీశంకర్ పరిశీలించారు. తనిఖీల్లో భాగంగా ఆయా థియేటర్ల యజమానులు అధిక ధరలకు టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించి.. వాటి మూసివేతకు ఆదేశించారు.