Mother and Son Suicide Attempt in Vizianagaram: పెరుగుతున్న సామాజిక మాధ్యమాల వినియోగం వల్ల.. ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విడిపోయిన వారు కలుసుకుంటున్నారు. అంతేకాకుండా కలిసి ఉన్న వారిలోనూ ఇవే సామాజిక మాధ్యమాలు చిచ్చుపెడుతున్నాయి. ఇక్కడ కూడా ఇద్దరి మధ్య ప్రేమకు ఫేస్బుక్ కారణమైంది.. కానీ, చివరకు వారి మధ్య అవే సామాజిక మాధ్యమాలు చిచ్చుపెట్టాయి.
ప్రేమించిన అమ్మాయి కారణంగా గౌరవ మర్యాదలు కోల్పోయామని విజయనగరంలో.. తల్లీకుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన యువతి వివాహం చేసుకోవాలని పట్టుబట్టడంతో.. ఆమె ప్రవర్తన అతనికి నచ్చకపోవటంతో ఆ యువకుడు వివాహానికి వెనకడుగు వేస్తూ వచ్చాడు. ఈ సమయంలో ప్రేమించిన యువకుడు, అతని తల్లిపైన అసభ్యంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలువడ్డాయి. ఇది గమనించిన తల్లీకుమారులు పురుగుల మందు తాగారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరంలోని అంబటి సత్రం సమీపంలో హసీన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అతనికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ఇరువురి మధ్య ప్రేమకు దారి తీసింది. దీంతో వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పెద్దల వరకు వారి ప్రేమ విషయాన్ని తీసుకెళ్లారు. వారు కూడా వీరి ప్రేమను కాదనలేదు. కానీ, ఇంతలోనే హసీన్‌కు ఆ యువతి ప్రవర్తన నచ్చలేదు.
ఆ యువతి సామాజిక మాధ్యమాల్లో అందరికి మేసేజ్‌లు చేయటం, కలివిడిగా ఉండటం అతనికి నచ్చలేదు. అదే సమయంలో ఆ యువతి వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. హసిన్ సోదరుడి కుమారుడు చనిపోవటంతో వివాహన్ని.. ఆ యువకుడు కుటుంబం దాట వేస్తూ వచ్చింది. దీంతో హసిన్ మోసం చేశాడని యువతి సంబంధీకులు ప్రచారం చేశారని... అంతేకాకుండా చంపుతామని బెదిరించారని ఆ యువకుడు సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. అంతటితో ఆగకుండా యువతి సంబంధీకులు సామాజిక మాధ్యమాల్లో.. తాను, తన తల్లిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారని వివరించాడు. దీంతో మనస్తాపానికి గురై ఓ నిర్ణయానికి వచ్చామని తెలిపాడు.
సమాజంలో తమ కుటుంబం మర్యాద పోయిందని.. ఇన్ని రోజులు గౌరవంగా బతికిన తమపై.. అగౌరవపరిచేలా పోస్టులు పెడుతున్నారని.. వారు సెల్ఫీ వీడియోలో వివరించారు. యువతి సంబంధీకులు చేసిన చర్యల వల్ల తమకు జీవించాలని లేదని.. చనిపోవాలని అనుకుంటున్నామని తెలిపారు. యువతికి సంబంధించిన వారు.. చంపుతామని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వీడియో రికార్డు చేసిన అనంతరం వారు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించటంతో.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తల్లీకుమారులు కోలుకుంటున్నారు.
ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన తల్లీకుమారుడు