కృష్ణా నదీ జలాలపై రెండు తెలుగు రాష్ట్రాలు వివాదాస్పదంగా మాట్లాడడాన్ని భాజపా తీవ్రంగా ఖండిస్తోందని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఆంధ్ర-తెలంగాణ ముఖ్యమంత్రులు అనేకసార్లు కలిసినా.. నీటి వాటాల విషయంలో ఇప్పుడు కొత్త వివాదాలు ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు.. ఈ విషయంలో కేంద్రాన్ని భాగస్వామ్యం చేయడాన్ని తప్పుగా భావిస్తున్నామన్నారు. ఆంధ్రా ప్రాంతానికి సంబంధించి నీటి వనరులు, వాటి వినియోగంపై భాజపా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 19న మేధావులు, నిపుణులతో జల వివాద పరిష్కారంపై శాస్త్రీయ అధ్యయనం చేపడుతున్నట్లు విజయనగరం జిల్లా భాజపా కార్యాలయంలోని కార్యవర్గ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీఎస్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్.. కృష్ణాజలాలపై మాట్లాడారు.
రాజకీయ లబ్ధి కోసమే మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి.. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై అసత్య ప్రచారం చేశారని ఆయన తప్పుబట్టారు. రామతీర్ధం, సింహాచలం, పద్మనాభ స్వామి దేవాలయాల భూములను ఆడిట్ చేసి కాపాడాలని డిమాండ్ చేశారు.
విశాఖపట్నం రూరల్, విజయనగరానికి సంబంధించి వీఎమ్మార్డీఏ(VMRDA) మాస్టర్ ప్లాన్లో లోపాలున్నాయని అన్నారు. విజయనగరం జిల్లాలోని రైతులకు ఈ మాస్టర్ ప్లాన్ సమాచారం తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్లాన్ను తెలుగులో ముద్రించాలని కోరారు. ఈ ప్లాన్ అమలైతే సుమారు 75 లక్షల మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతారని తెలియజేశారు.