విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ అభివృద్ది పనులను ఆరంభించేందుకు, ప్రారంభోత్సవ మాసోత్సవాలు పేరిట చేపట్టిన కార్యక్రమానికి మంత్రులు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ధర్మపురి, పార్క్ గేట్, బాబామెట్టవద్ద 1.18కోట్ల రూపాయలతో నిర్మించిన మూడు బీటీ రోడ్లు, బాబామెట్ట పార్కును, అలాగే అమృత్ ఫేజ్-2 పథకం క్రింద దాసన్నపేటలో 110.40 కోట్లతో నిర్మించిన వాటర్ ట్యాంకును ఎమ్మెల్లే కోలగట్ల, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌తో కలసి మంత్రులు ప్రారంభించారు.
మాది మహిళా పక్షపాత ప్రభుత్వం: బొత్స
అనంతరం ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి అధ్యక్షతన దాసన్నపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి బొత్స మాట్లాడుతూ....రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా తమ ప్రభుత్వం అందరి సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజలందరి కనీస అవసరాలను తీర్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. వారి సంక్షేమానికి చిత్తశుద్దితో కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో అభివృద్ది పూర్తిగా కుంటుపడిందని, ప్రజల సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. విజయనగరం పట్టణంలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు అప్పట్లో రామతీర్ధసాగర్ ప్రాజెక్టును తెచ్చామని, రాజకీయ కారణాలతో గత ప్రభుత్వ పెద్దలు దీనిని ఉద్దేశపూర్వకంగా కక్షగట్టి పక్కనబెట్టారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని., ముఖ్యంగా మహిళా పక్షపాత ప్రభుత్వమని పేర్కొన్నారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఇది నిరంతర కార్యక్రమంగా కొనసాగుతుందని మంత్రి బొత్స చెప్పారు.