Minister Botsa Satyanrayana : పరీక్ష పత్రాల లీకులకు పాల్పడటం నీచమైన కార్యక్రమం.. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే అలాంటి వారిని దేవుడు కూడా క్షమించడని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తెలంగాణలో పదో తరగతి పేపర్ లీక్ పై చోటు చేసుకున్న రాజకీయ రగడపై మంత్రి బొత్స స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. విజయనగరం నగరపాలక సంస్థ చేపట్టిన నగర సుందరీకరణ పనుల్లో భాగంగా ఐస్ ఫ్యాక్టరీ కూడలిలో రూ.31.50లక్షలతో ఏర్పాటు చేసిన దండిమార్చ్ నమూనా దేశ నాయకులు విగ్రహాలు, వాటర్ ఫౌంటేన్ ను మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, నగరపాలక సంస్థ మేయర్ విజయలక్ష్మి తదితరులతో కలసి ప్రారంభించారు.
పటిష్ట చర్యలు.. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పటిష్ఠ చర్యలు చేపట్టామన్నారు. గతేడాది పేపర్ లీక్ కు పాల్పడిన 75మందిపై కేసులు నమోదు చేయటంతో పాటు.. ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేశామని చెప్పారు. అదేవిధంగా ఓ విద్యాసంస్థపై కేసు పెట్టామని.. ఈ ఏడాది అలాంటి చర్యలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. తెలంగాణలో చోటు చేసుకున్న పరిణామాలను పరోక్షంగా విమర్శిస్తూ.. నీచమైన చర్యగా మంత్రి బొత్స అభిప్రాయపడ్డారు.
ఫ్యామిలీ డాక్టర్ను సద్వినియోగం చేసుకోవాలి... ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా విజయనగరం మండల పరిధిలోని ద్వారాపూడిలో మంత్రి బొత్స.. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, కలెక్టర్ సూర్యకుమారి, వైద్యశాఖ అధికారులతో కలసి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని వివరించారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మళ్లీ గెలిపించాలి... మీ ఆశీస్సులు, దీవెనలు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని.. మళ్లీ, మళ్లీ ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటేనే పేదలకు మంచి జరుగుతుందని., పేదల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రారంభోత్సవ ప్రసంగం ముగించుకుని వెళ్లిపోతుండగా ఇళ్ల స్థలాలు, పింఛన్లపై మంత్రి బొత్సను మహిళలు చుట్టుముట్టారు. ఇద్దరికి సమాధానం చెప్పి మంత్రి అక్కడి నుంచి జారుకున్నారు. అయితే, అంతకు ముందు సభా కార్యక్రమాలో భాగంగా మంత్రి.. పింఛన్లు, ఆసరా, అమ్మఒడి, విద్యాదీవెన కార్యక్రమాలపై పలువురిని మహిళలు ప్రశ్నించగా సానుకూలంగా సమాధానమిచ్చారు.