జిల్లాలో ఉపాధి నిధులతో కన్వర్జెన్స్ పనులను పెద్ద ఎత్తున చేపట్టామని.. వాటిని నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులకు మంత్రి బొత్స చెప్పారు. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎం.హరిజవహర్ లాల్, సంయుక్త కలెక్టర్లు కిషోర్ కుమార్, వెంకటరావు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, గనులశాఖ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి ఇటీవల నిర్వహించిన స్పందన వీడియో కాన్ఫరెన్సులో జిల్లాలో ఉపాధి కన్వర్జెన్స్ పనులు మరింత వేగవంతం కావలసిన అవసరాన్ని తెలియజేసిన దృష్ట్యా ఈ మేరకు మంత్రి అధికారులతో సమీక్షించారు.
ఇప్పటివరకు చేపట్టిన కన్వర్జెన్స్ పనులకు గాను 65 కోట్ల రూపాయల మేరకు బిల్లులు రావాల్సి ఉందని కలెక్టర్ హరిజవహర్ లాల్ అన్నారు. పెండింగ్ నిధులు విడుదలైతే పనులు మరింత వేగవంతం అయ్యే అవకాశం వుందని మంత్రికి తెలియజేశారు. సచివాలయాల భవన నిర్మాణాలు, ఇతర భవనాలు ఏ స్థాయిలో ఉన్నది జాయింట్ కలెక్టర్ వెంకటరావు మంత్రికి వివరించారు. స్పందించిన మంత్రి.. బొబ్బిలి, నెల్లిమర్ల శాసనసభ్యులకు ఫోన్ చేసి వెంటనే ఆయా నియోజకవర్గాల్లో పనులను గుత్తేదారులకు అప్పగించాలని లేని పక్షంలో వాటిని రద్దుచేసే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.