విజయనగరం జిల్లా ఉన్నతాధికారులు, వైద్యారోగ్య శాఖాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. కొవిడ్ నియంత్రణకు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ హరి జవహర్ లాల్.. మంత్రికి వివరించారు. కొవిడ్ వ్యాధి పట్ల స్థానికంగా విస్తృతంగా అవగాహన కల్పించాలని బొత్స సత్యనారాయణ సూచించారు. జిల్లాలోని అన్ని కొవిడ్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్, ఇతర వసతులను కల్పించాలని ఆదేశించారు. జ్వరాలపై దృష్టి పెట్టి, వెంటనే వారికి చికిత్సను అందించే ఏర్పాటు చేయాలన్నారు.
రెమ్‌డెసివిర్, ఇతర మందుల కొరత రాకుండా చూడాలన్నారు. మున్సిపల్ కమిషనర్లంతా మరింత అప్రమత్తంగా ఉండాలని, పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని మంత్రి బొత్స అన్నారు. మృతదేహాలను త్వరగా తరలించాలని, అవసరమైతే అదనంగా అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని తీసుకోవాలన్నారు. ప్రైవేటు అంబులెన్సుల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రితో కలిసి రెండు మూడు రోజుల్లో కొవిడ్‌పై సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. దీనికి అధికారులంతా సిద్ధంగా ఉండాలని మంత్రి కోరారు.