Minister Botsa Satyanarayana : విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ చర్యలపై.. ఉపాధ్యాయులు ఎందుకు ఆందోళన చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు సరిగా నిర్వహించని అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటే ఉపాధ్యాయులకు సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై, ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు పాల్గొన్నారు.
సమీక్ష సమావేశం అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పర్యటనలో ఆయన దృష్టికి వచ్చిన వాటిపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఆయన గమనించిన లోపాలను.. వాటి పట్ల అధికారులపై చర్యలు తీసుకుంటే ఉపాధ్యాయులకు సంబంధం ఎంటనీ ప్రశ్నించారు. జూలై నెలలో వచ్చిన పుస్తకాలు ఇప్పటి వరకు పంపిణీ చేయకపోవటం సరికాదని.. వాటిని ఇవ్వకుండా ఉంటే మీరు ఒప్పుకుంటారా అంటూ మీడియాను ప్రశ్నించారు.
ప్రవీణ్ ప్రకాశ్ పర్యటనలో గుర్తించిన లోపాలను నమోదు చేసుకున్నామని.. వాటిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చర్యలు తీసుకున్న అధికారుల తప్పదాలేమి లేవని దర్యాప్తులో తేలితే.. చర్యలను ఉపసంహరించుకుంటామని వెల్లడించారు. పుస్తకాలు డిసెంబర్ నెలలో వచ్చాయని అందుకే పంపిణీలో అలస్యమైందని.. ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నట్లు మీడియా మంత్రి దృష్టికి తీసుకువెళ్లింది. అప్పుడు మంత్రి సమాధానమిస్తూ.. డిసెంబర్ నెలలో రాలేదని, దానిని ఆయన ధృవీకరించను అని అన్నారు. ఉపాధ్యాయులకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు. అంతే తప్పా దీనికి సంబంధం ఏమిటని అన్నారు.