Minister Botsa On Thotapalli surplus water:తోటపల్లి మిగులు జలాల వినియోగంతో విజయనగరం జిల్లాలో సుమారు 20 వేల ఎకరాలు సాగులోకి వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బొబ్బిలి మండలం పిరిగి గ్రామం వద్ద తోటపల్లి మిగులు జలాలు వినియోగంలోకి తెచ్చేందుకు చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. రూ.59.58 కోట్ల వ్యయంతో మిగులు జలాలను వినియోగంలోకి తీసుకురానున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. పార్వతీపురం, బొబ్బిలి, రాజాం నియోజకవర్గాల్లోని భూములు సాగులోకి వస్తాయన్నారు. ఏడాదిలో ఈ పనులను పూర్తిచేసి సాగునీరు అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
గత పాలకులు తోటపల్లి జలాలను వినియోగంలోకి తీసుకురావటంలో నిర్లక్ష్యం వహించి రైతులకు తీరని అన్యాయం చేశారని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో పనులు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
సాగు నీరు అందుబాటులోకి వస్తున్నందున అధిక దిగుబడి వచ్చే పంటల వైపు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సూర్యకూమారి రైతులకు సూచించారు. వాణిజ్య పంటల సాగు వల్ల అధిక లాభాలు పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, సబ్ కలెక్టర్ భావన, పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.