వీధి వ్యాపారులకు 'జగనన్న తోడు పథకం' రెండో విడత ఆర్థిక సహాయం కార్యక్రమంలో భాగంగా.. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మంత్రులు బొత్స, వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ముగిశాక.. విజయనగరం జిల్లా లబ్ధిదారులకు జగనన్న తోడు ఆర్థిక సహాయం చెక్కులు, గుర్తింపు కార్డులు అందజేశారు.
అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరీ అప్పులు చేసి.. డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తున్నాయని అన్నారు. అయితే ఒక్కటి మాత్రం సత్యం. కొవిడ్ సృష్టించిన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో.. ఈ పథకాలు ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచుతాయని మంత్రి తెలిపారు. కొవిడ్ ప్రభావం నేపథ్యంలో.. ప్రజల ఆర్థిక స్థితిగతులను ప్రభుత్వాలు పెంచాల్సి ఉందని ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి.. కొనుగోలు శక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలోనే ఈ పథకాలకు రూపకల్పన చేశారని.. వీటిని కేంద్రం కూడా అనుసరిస్తోందని మంత్రి తెలిపారు. సంక్షేమ పథకాలపై అన్నివర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయన్నారు.