అవును.. అమ్మ చెప్పింది కదా...!
అప్పుడే తల్లి పార్వతి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. భూలోకానికి వెళ్లేటప్పుడు గతంలో రహదారులపై రద్దీ విషయాన్ని, ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్త చెప్పే తల్లి నోటి వెంట ఆ మాటలేవీ ఈసారి వినలేదు. ఏదో మానవాళిని భయకంపితులను చేసే మాయదారి మహమ్మారి కరోనా అనే పేరుతో ప్రపంచాన్ని పీడిస్తున్నదని వివరించింది. జనులు ఒకరిని ఒకరు దరి చేరడంలేదని, ఒకరితో ఒకరు ముఖం చూపించి మాట్లాడుకోవడం లేదని, బంధుత్వాలు, స్నేహబంధాలు ఏవీ ఇప్పుడు మనిషి జీవితం నుంచి దూరం అవుతున్నాయని చాలా చెప్పింది. పూజలు అందుకొనేటప్పుడు, ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు అత్యంత జాగరూకతతో ఉండాలని హితబోధ చేసింది. బయట తినుబండారాలేవీ తినకూడదని ఒకటికి ముమ్మార్లు చెప్పింది. ఎవరి ఇంట ప్రసాదాన్ని తీసుకున్నా పరిశుభ్రతను గమనించి, నియమనిష్టలను గుర్తించి స్వీకరించాలని చెప్పింది. వీధులు ప్రశాంతంగా ఉండడానికి, మండపాలు లేకుండా ప్రశాంతంగా ఉండడానికి ఆ కరోనాయే కారణమై ఉంటుంది.
కోరుకున్న విధానం ఇదే..
మూషికా.. నిజానికి నేను కోరుకున్న భక్తి వాతావరణం ఇప్పుడు కనిపిస్తుంది. మనసులో నన్ను ప్రతిష్ఠించుకొని, నిర్మల చిత్తంతో స్మరించుకుంటే చాలదా? ఇంట్లో నలుగురు కూర్చొని నా పూజ చేసుకోవడం ఎంత ఆనందం పంచుతుంది. కుడుములు ప్రసాదంగా పెట్టిన భక్తుల ఇడుములు మటుమాయం చేయనా? ఉండ్రాళ్లు నైవేద్యంగా సమర్పించిన భక్తుల ఆరోగ్యాన్ని కాపాడనా? ఆరోగ్యానికి మంచి చేసే ఇరవై ఒక్క జాతుల పత్రాలతో పూజలు అందుకోవాలని నేను ఎవరినీ కోరలేదు. వాటితో మానవాళికి ఆరోగ్యం అందుతుందని భావించి, భక్తితో నాకందించడం ద్వారా జనులు ఆరోగ్యం పొందాలని భావించాను. ఈ విపత్కర పరిస్థితిలో ఇంటి పట్టునే, భక్తితో వినాయక చతుర్థి పూజను చేసిన వారిని రక్షించుకోనా? మనిషికి సవాలు విసిరే కరోనా వంటి ప్రమాదగణాల పైకి ప్రమదగణాలతో వెళ్లి అంతం చేసి సుఖశాంతులు అందించే బాధ్యత శూర్పకర్ణుడైన నాపై లేదా?