విజయనగరం జిల్లా సీతానగరం మండలం చెల్లంనాయుడువలసకు దశాబ్దాలుగా సైబీరియన్ పక్షులు వలస వస్తుంటాయి. చింతచెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకుని సేదతీరుతాయి. ఆరునెలల పాటు కిలకిల రాగాలతో కనువిందు చేస్తాయి. సంతానోత్పత్తి చేసుకుని స్వదేశానికి సంతోషంగా తిరిగి వెళ్తాయి. వీటి రాక, పోకను గ్రామస్థులు కూడా అదృష్టంగా భావిస్తారు.
వింతవ్యాధితో విదేశీ విహంగాలు విలవిల - chellamnaiduvalasa village latest news
ఎన్నో దేశాలు దాటి విజయనగరం జిల్లాకు వస్తుంటాయి సైబీరియన్ విహంగాలు. ఏటా ఈ పక్షులు శీతల దేశం సైబీరియా నుంచి సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వస్తుంటాయి. అయితే కొన్నిరోజులుగా ఈ విదేశీ అతిథులను వింత వ్యాధి కబళిస్తోంది. చెట్టు మీద నుంచి కింద పడి గిలగిల కొట్టుకుంటూ మృత్యువాతపడుతున్నాయి.
![వింతవ్యాధితో విదేశీ విహంగాలు విలవిల Migratory birds are dying](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8922063-141-8922063-1600949520685.jpg)
ప్రతిఏడాది మాదిరే ఈ సారి కూడా సైబీరియన్ పక్షులు జూన్ నెలలో వందల సంఖ్యలో గ్రామానికి వచ్చాయి. గ్రామ సమీపంలోని చెరువులు, నీటి కుంటల పరిసర ప్రాంతాల్లో చెట్లపై ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. అయితే కొన్ని రోజులుగా ఈ విహంగాలు వింతవ్యాధితో సతమతమవుతున్నాయి. చెట్టు నుంచి కింద పడి గిలగిల కొట్టుకుంటూ మృత్యువాత పడుతున్నాయి. ఇలా మూడు రోజుల వ్యవధిలోనే సుమారు వంద పక్షుల వరకు ప్రాణాలు విడిచాయి. ఈ సంఘటన గ్రామస్థులను కలచివేస్తోంది. ఒక్కసారిగా విదేశీ పక్షులు ప్రాణాలు విడుస్తుండటంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఇసుక తిన్నెల్లో చిక్కుకొని వందలాది తిమింగలాలు మృతి