ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూగర్భజలాల వృద్ధి కోసం ఇంకుడు గుంతల ఏర్పాటుకు చర్యలు - విజయనగరంలో ఇంకుడు గుంతలు కార్యక్రమం

రోజురోజుకి జనాభా విస్తరిస్తున్న తరుణంలో... విజయనగరంలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. భూగర్భజలాల వృద్ధి కోసం ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

vizayanagaram
నీటి సమస్యలపై దృష్టి

By

Published : Sep 18, 2020, 2:41 PM IST

Updated : Sep 18, 2020, 3:10 PM IST

విజయనగరంలోని మొత్తం 60వార్డుల్లో... 24వార్డులకు తాటిపూడి జలాశయం ద్వారా తాగునీరు వస్తోంది. ఆ జలాలతోనే సుమారు 2లక్షల జనాభాకు తాగునీరు లభిస్తోంది. తాటిపూడిలో నీటిమట్టం కనిష్ఠస్థాయికి పడిపోయిన ప్రతిసారి... నగరంలో నీటి సమస్య తీవ్రతరమవుతోంది. ప్రధానంగా కంటోన్మెంట్, తోటపాలెం, కె.ఎల్.పురం, బాలాజీ నగర్, కొత్త అగ్రహారం తదితర ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు తారస్థాయికి చేరుతాయి.

ఈ నేపథ్యంలో భవిష్యత్తు మంచినీటి అవసరాల దృష్ట్యా... నగరపాలక సంస్థ భూగర్భజలాల వృద్ధిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ అధికారులు ఇంకుడు గుంతల నిర్మాణం సాధ్యాసాధ్యాలపై సర్వే నిర్వహించి... 730 స్థలాలను గుర్తించారు. గుర్తించిన ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టారు. తొలివిడత చేపడుతున్న 730ఇంకుడు గుంతలన్నింటినీ నగరపాలక సంస్థ నిధులతోనే నిర్మిస్తున్నట్లు అధికారులు తెలియచేశారు.

ఇంకుడు గుంతల ఏర్పాటు తప్పనిసరి..

ప్రభుత్వ నిబంధనల మేరకు... 300 చదరపు మీటర్లు దాటిన అన్ని నిర్మాణాలకు ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవటం తప్పనిసరి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మరియు కార్యాలయాలలో కూడా నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం 250గజాల నుంచి 500గజాల విస్తీర్ణంలో ఉన్న ప్రతి ఇంటి ఆవరణం, బహుళ అంతస్తుల ఆవరణలో ఇంకుడు గుంతలను నగరపాలక సంస్థే ఏర్పాటు చేస్తోంది. 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు, 9 అడుగుల లోతు ఉండేలా గుంత నిర్మిస్తున్నారు. 730 ఇంకుడు గుంతలకు 90.52లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది.

నగరపాలక సంస్థ చేపట్టిన ఈ చర్యల పట్ల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకుడు గుంతల ఏర్పాటు ద్వారా... భవిష్యత్తులో నీటి సమస్యల నుంచి కొంతమేర బయటపడవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:కరోనా పోటు.. కొబ్బరి రైతుకు గుండె కోత

Last Updated : Sep 18, 2020, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details