విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 14 విద్యాసంస్థలు నడుస్తున్నాయి. కొవిడ్ కారణంగా ఈ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 16 నెలలుగా 50శాతం జీతాలే అందుతున్నాయి. ఛైర్మన్ వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలతో కొంత కాలంగా ఉద్యోగుల జీతాల చెల్లింపు సమస్యగా మారింది. ఇందులో భాగంగా ఈ నెల జీతాలు పూర్తిగా నిలిపివేశారు. ఛైర్మన్ అశోక్ గజపతిరాజు రాసిన లేఖ ద్వారా ట్రస్టు కార్యనిర్వహణాధికారే జీతాల నిలుపుదలకు కారణమని తెలియడంతో ఉద్యోగులంతా మాన్సాస్ కార్యాలయాన్ని ముట్టడించారు. బ్యాంకులకు రాసిన ఉత్తర్వులను చూపిస్తూ సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. ఈవో వ్యవహరిస్తున్న తీరుపై ఆక్రోశం వ్యక్తం చేశారు.
ఈవో తీరుని నిరసిస్తూ సుమారు 5 గంటల పాటు ఆందోళన చేసిన ఉద్యోగులు మంగళవారం నాటికి సమస్య పరిష్కారిస్తామని ఈవో చెప్పడంతో ఆందోళన విరమించారు. ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజును కలిసి తమ సమస్యల్ని వివరించారు. ఈవోని అడ్డుపెట్టుకుని ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ఛైర్మన్ అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. ట్రస్టులో నిధులున్నా.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవటానికి కారణాలేంటని ప్రశ్నించారు.